
ఇంటర్నెట్‌డెస్క్‌: సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల (Saudi Arabia-Houthis) ఘర్షణతో పాకిస్థాన్‌కు గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. మక్కా ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతోన్న ఈ ఘర్షణలు దాయాది ( Pakistan )ని గట్టిగానే ఇబ్బంది పెడుతున్నాయి. రక్షణ ఒప్పందం కుదిరినా.. సౌదీతో పాక్ కలిసిరావడం లేదు. మరోవైపు హూతీల దాడులు తీవ్రంకావడంతో సౌదీ వద్ద ఎగుమతి కోసం కేటాయించిన చమురు కొన్నిరోజుల్లోనే ఖాళీ కానున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం మరో మలుపు తీసుకుంది. హూతీల దాడులతో సౌదీ అరేబియా ( Saudi Arabia ) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మక్కా ఒప్పందం నేపథ్యంలో పాకిస్థాన్ ఇటీవల హూతీలకు హెచ్చరికలు చేసింది. దాడులు విస్తరిస్తే మక్కా ఒప్పందం యాక్టివేట్ అవుతుందని పేర్కొంది. కానీ తర్వాత ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గింది. హూతీలపై సైనిక స్పందన అవసరం లేదని, దాని గురించి ఎలాంటి చర్చ జరగడం లేదని చెప్పింది. పాక్ యూటర్న్ తర్వాతే సౌదీ విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చి బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌ ప్రధాని షహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) నుంచి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS)కు ఫోన్ వెళ్లింది. హూతీల దాడులు ప్రాంతీయంగా శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించాయని షరీఫ్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన సరఫరాలకు ఇవి అంతరాయంగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సౌదీ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలిపారు. దీంతో ఈ ఒప్పందం మాటల వరకే పరిమితమైందని అర్థమవుతోంది. అటు అమెరికా, ఇటు పాక్ కలిసి రాకపోవడంతో సౌదీ ( Saudi Arabia ) ఒంటరైపోయిందనే చెప్పాలి. హూతీల డ్రోన్‌ దాడులతో ఇంధన సరఫరాలో కీలకమైన ఈస్ట్‌-వెస్ట్ పైప్‌లైన్‌ను సౌదీ మూసివేసింది. ఆ దాడుల వల్ల పైప్‌లైన్‌ ఏమైనా దెబ్బతిన్నదా అనేది మాత్రం తెలియరాలేదు. ఎప్పుడు దానిని తిరిగి ప్రారంభిస్తుందో కూడా సౌదీ వెల్లడించలేదు. ఎర్రసముద్రంలో కీలకమైన ఈ పైప్‌లైన్‌ను సౌదీ పునఃప్రారంభించకపోతే.. కొద్దిరోజుల్లోనే ఎగుమతి కోసం అందుబాటులో ఉన్న చమురు ఖాళీ అవుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోన్న చమురులో నాలుగు శాతం వరకు తగ్గుదల నమోదుకావొచ్చని మీడియా కథనం పేర్కొంది. ఈ కొరతతో ఇంధన ధరలు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





