
హైదరాబాద్‌: ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని శాసనసభ వేదికగా తెలిపారు. 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌కు ఉందో? లేదో తేల్చాలన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ‘‘సిద్దిపేటలో కేసీఆర్‌ కుటుంబానికి 67.5ఎకరాలు ఉంది. కేటీఆర్‌ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు, జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉంది. కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాలున్నాయి. కేటీఆర్‌ జన్వాడ ఫామ్‌హౌస్‌పై నేనెందుకు బాంబులు వేస్తా? నేనేమైనా బిన్‌లాడెన్‌నా. స్టీఫెన్‌సన్‌కు ఎన్నికల ముందు నజరానా ఇచ్చారు. రూ.50 కోట్ల భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్‌ చేశారు. గంగుల, ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డి 650 ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేశారు. జగదీశ్‌రెడ్డి 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చింది. పైలట్‌ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారు. ఒక కుటుంబానికి కుష్కి పొలం 54, తరి పొలమైతే 27 ఎకరాలుండాలి. కానీ, కేసీఆర్‌కు ఉన్నది మొత్తం తరి పొలమే’’ అని సీఎం వివరించారు. మరోవైపు ఎల్బీనగర్‌లో జీవో 118 పరిధిలో ఉన్నవారందరికీ త్వరలో శుభవార్త చెబుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. జీవో 118 కింద పెండింగ్‌ దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో 9,500 మంది బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. కొందరు కొల్లగొట్టిన వేల ఎకరాల వివరాలు సభ ముందుంచుతా: సీఎం రేవంత్‌రెడ్డి .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.