
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ తో సమావేశమయ్యారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ వంశపారంపర్య ఇమామ్, ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) చైర్మన్ అయిన ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ Vకి తెలంగాణలో ఇదే తొలి అధికారిక పర్యటన. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, చారిత్రక కట్టడాల పరిరక్షణపై ఇరువురు ముఖ్యమైన అంశాలను చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారని సీఎం వివరించారు. హైదరాబాద్ నగరం పాతకాలపు వైభవాన్ని పునరుద్ధరించే క్రమంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం, కుతుబ్ షాహీ టాంబ్స్ పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ వహించిన కీలక పాత్రను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అదే తరహాలో నగరంలోని మరికొన్ని ప్రధాన హెరిటేజ్ ప్రాజెక్టులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు సిటీ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్ పాత భవనాల పునరుద్ధరణకు ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గోషామహల్లో నూతన ఉస్మానియా హాస్పిటల్ భవనాన్ని నిర్మించనున్నామని, ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని ఒక ప్రధాన హెరిటేజ్ ఆస్తిగా అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా మూసీ నదిని రాత్రి వేళల్లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా, అంటే నైట్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలను ఆగా ఖాన్‌కు సీఎం వివరించారు. ఈ భేటీకి ముందు రోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్ భవన్లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ కి స్వాగతం పలికారు. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ తన పర్యటనలో భాగంగా ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న పట్టణ పునరుద్ధరణ, ఆరోగ్యం, మహిళా అభివృద్ధికి సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఉన్న వివిధ అవకాశాలపై సానుకూలంగా స్పందించారు.




