
Pithapuramlo… Ala Modalaindi | కుటుంబ బంధాలు, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనురాగం, నేటి తరానికి సరిపోయే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుతూ సినిమా విజయంపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలోని తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే అద్భుతమైన కంటెంట్ ఈ చిత్రంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే కథే ఇదని, క్లైమాక్స్ సన్నివేశాలు చూసి ఆర్టిస్టులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఇందులో ఎంతటి బలమైన ఎమోషన్ ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి ఈ చిత్రాన్ని ఆదరించాలని ఆయన ప్రేక్షకులను కోరారు.
దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ, తాను ఈ సినిమాకు మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశానని, ఇప్పటివరకు తాను చేసిన చిత్రాలన్నింటికంటే ఇది ఒక భిన్నమైన స్థాయిలో ఉంటుందని చెప్పారు. నిర్మాతలలో ఒకరైన ఆకుల సురేష్ మాట్లాడుతూ, తన ఊరిలో చూసిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నానని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం కచ్చితంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సుమన్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, బివిఎస్ రవి, వీర శంకర్, సముద్ర, రాం ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, చిన్న సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఇది చక్కటి అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.





