
ఇంటర్నెట్‌ డెస్క్‌: చదువుకోవాలనే తపన, సాధించాలనే సంకల్పం ఉండాలే గానీ.. ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని నిరూపించారీ తోబుట్టువులు. కడు పేదరికం, అరకొర వసతులు ఇబ్బంది పెట్టినా.. వాటిని దాటుకుని ప్రాణం పోసే వైద్య వృత్తి వైపు అడుగులు వేశారు. ఒకరి తర్వాత ఒకరు నీట్‌ ( NEET )లో ఉత్తీర్ణత సాధించి వైద్య విద్య (Medicine)లో ప్రవేశం పొందారు. ఓ నిరుపేద ఆదివాసీ రైతు కుటుంబంలో పుట్టిన ఐదుగురు అన్నాచెల్లెళ్ల కథ ఇది..! (Five children in Tribal family) ఒడిశా (Odisha)లోని కంధమాల్‌ జిల్లా సికాబడి గ్రామానికి చెందిన బృషినాయక్‌, అనుశాయ దంపతులది నిరుపేద కుటుంబం. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. కొన్నిసార్లు కుటుంబాన్ని పోషించేందుకు బృషి నాయక్‌ వలసకూలీగా ఇతర రాష్ట్రాల్లో పనిచేశారు. అతడు చదువుకోలేదు, కానీ చదువు ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. అందుకే, ఎంత కష్టమైనా సరే పిల్లలను చదివిస్తున్నారు. తండ్రి బృషినాయక్‌ కష్టం చూసిన కుమారుడు బిబీశన్‌ మంచిగా చదువుకుని నీట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. కొరాపూట్‌లోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన అతడు.. ప్రస్తుతం అక్కడే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాడు. బిబీశన్‌ స్ఫూర్తితో పెద్ద చెల్లెలు మోనాలిసా కూడా నీట్‌లో అర్హత సాధించి.. ఇదే మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. ఆ తర్వాత మరో ముగ్గురు చెల్లెళ్లు సునేమీ, ఆశ్రియా, మీనాక్షి కూడా ఈ ఏడాది నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ప్రభుత్వ రంగ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇందులో మీనాక్షి.. బృషి తమ్ముడు జిశియా కుమార్తె. కానీ కొన్ని కారణాల రీత్యా చిన్నతనం నుంచి ఆమెను బృషి దంపతులే పెంచుతున్నారు. ‘‘వీళ్లంతా నా పిల్లలే. మా ఇంట్లో మొత్తం 9 మంది ఉంటాం. మరో ఇద్దరు కుమారులు స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలు ఏం కోర్సులు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ, వారంతా జీవితాల్లో స్థిరపడి సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది’’ అని వీరి తల్లి అనుశాయ ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లల చదువుల కోసం ఇప్పటికే కొంత రుణం తీసుకున్నామని, అయితే వైద్య విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వం తమకు అండగా నిలవాలని బృషి నాయక్‌ కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





