
నిజామాబాద్: అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాలను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోతంగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అకడమిక్, అడ్మిన్ బ్లాక్‌లు, డార్మెటరీ, కిచెన్, డైనింగ్, ఇండోర్ గేమ్స్, క్రికెట్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్, టీచర్స్ క్వార్టర్స్, సెక్యూరిటీ బ్లాక్, పార్కింగ్ తదితర నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల వివరాలపై ఆరా తీశారు. నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తయ్యేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కొడిచెర్ల ఇసుక క్వారీని సందర్శించారు. క్వారీలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం నిబంధనలను అనుసరిస్తూ ఈ క్వారీ ద్వారా ఇసుకను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా గట్టి నిఘా ఉంచాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





