
నెల్లూరు (నగరపాలక సంస్థ): కార్పొరేట్ హంగులతో నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ నేతృత్వంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నెల్లూరు నగరంలో మొత్తం 15 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వీఆర్‌సీ స్కూల్‌ను ఆధునికీకరించారు. ఈ నేపథ్యంలో బుధవారం నెల్లూరు పట్టణం స్టోన్ హౌస్ పేటలో ఆధునికీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు నెల్లూరు ఎంపీ, వీపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల భవనాలను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల మొత్తం కలియతిరిగి తరగతి గదులు, ల్యాబ్స్‌, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరాతీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని మంత్రి లోకేశ్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి. నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి.షరణి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





