
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఈనాడు, సూర్యాపేట, న్యూస్‌టుడే, సూర్యాపేట కలెక్టరేట్‌: ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లోని కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేదు. పేరున్న కంపెనీలే ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మీ ఊరికే వస్తున్నాయి. ఈ నెల 19న కోదాడ పట్టణం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం మెగా ఉద్యోగ మేళా పేరుతో కల్పించబోతున్న సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకున్న ఉపాధి రంగంలో కొలువుదీరాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆఫర్‌ లెటర్లు అందజేయనున్నారని తెలిపారు. సూర్యాపేట కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, సామేల్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. జాబ్‌మేళాలో కొలువు పొందాలనుకునే వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గోడ పత్రికపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు. అది సాధ్యపడని వారు నేరుగా జాబ్‌ మేళా వద్దకు వచ్చి ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు ఇవ్వొచ్చు. అందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. అవసరమైన సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఇప్పటికే ఈ జాబ్‌ మేళా గురించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టారు. అందుకు తగినట్లే నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అపోలో గ్రూప్, జీఎంఆర్, రాంకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, సిమెంట్‌ తయారీ పరిశ్రమలు, సేవలు, ఐటీ, ఫార్మా, నిర్మాణ, వ్యాపార రంగాలకు చెందిన అనేక ప్రముఖ సంస్థలు వచ్చేలా సంప్రదింపులు చేస్తున్నారు. కొలువుల జాతరకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి ఐదు సంస్థల ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌), తెలంగాణ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌(డీఈఈటీ) సహకారంతో గతేడాది హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌ మేళాలో 200పైగా కంపెనీలు పాల్గొనగా, ఈసారి కోదాడలో నిర్వహించే జాబ్‌ మేళాకు 300 కంపెనీలు పాల్గొనబోతున్నాయి. 3,500 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ఏర్పాట్లు చేపట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది నిరుద్యోగులు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నారు. ప్రదేశం: కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌ స్కూల్‌ సమయం: 19వ తేదీ (శనివారం) ఉదయం 8 గంటల నుంచి అర్హతలు: పది ఉత్తీర్ణత, ఆపై విద్యార్హతలు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.