
వారంతా రోజు కూలీలు.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కానీ వర్షం వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది. వారు రెండేళ్ల కిందట లీజుకు తీసుకున్న భూమిలో అరుదైన నిధి లభ్యమైంది. దీంతో వారి సంతోషాలకు పట్టపగ్గాల్లేకుండా పోయింది. మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాల గనుల్లో రోజు కూలీలకు ఖరీదైన వజ్రం దొరికింది. సర్కోహా గ్రామంలోని ఒక గనిలో ఏడుగురు కార్మికులకు 17.96 క్యారెట్ల వజ్రం లభ్యం కాగా.. దాని విలువ రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. అయితే దాని ఖచ్చితమైన విలువ ప్రభుత్వ వేలం తర్వాత నిర్ణయించనున్నారు. తమ ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయని వారు సంబరపడిపోతున్నారు.జెమ్ క్వాలిటీ రకంఇది అత్యంత నాణ్యమైన సహజ వజ్రాలలో ఒకటైన ‘జెమ్ క్వాలిటీ’ రకానికి చెందిందని పన్నా వజ్రాల అధికారి రవి పటేల్ తెలిపారు. అత్యంత ‘విలువైనది’గా అభివర్ణించిన పటేల్.. అక్టోబర్ మొదటి వారంలో దీనిని వేలానికి ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ కనీసం రూ. 50 లక్షలు వరకు ఉంటుందని ఆయన అంచనా వేశారు. దేశంలోనే అత్యధిక వజ్రాల నిల్వలు ఉన్న పన్నా జిల్లాలో ఇలాంటి వజ్రాలు లభ్యం కావడం కొత్తేం కాదు. అయినప్పటికీ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఇది ఒకటి. ఇక్కడి ప్రజలను తీవ్ర పేదరికం, నీటి ఎద్దడి, నిరుద్యోగ సమస్య వేధిస్తున్నాయి. సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అదృష్టం కలసివచ్చి వజ్రం దొరికితే తమ తలరాత మారుతుందనే ఆశతో స్థానికులు వజ్రాల కోసం అన్వేషిస్తారు.వర్షంతో కలిసొచ్చిన అదృష్టంసరోఖా గ్రామంలో ఉన్న ఈ గనిని అఖిలేష్ పాల్, మరో ఏడుగురు కలిసి రెండేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారు. ఏడాది పాటు తవ్వకాలు జరిపినా ఫలితం లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఏడాది పాటు మూతపడిన ఈ గనిని ఇటీవలే తెరవగా.. సోమవారం భారీ వర్షాల తర్వాత పరిశీలిస్తుండగా ఈ వజ్రం మెరుస్తూ కనిపించింది. అఖిలేష్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా తవ్వకాలు జరిపామని, అదృష్టం కలిసిరాకపోవడంతో గనిని మూసివేసి, పక్కనే మరొక గనిని ప్రారంభించామని చెప్పారు. కొత్త గనిని పరిశీలించడానికి వెళ్లినప్పుడు, పాత గని లోపలికి కూడా తొంగి చూడగా మట్టి పైన ఈ వజ్రం మెరుస్తూ కనిపించిందని ఆయన వివరించారు.నిబంధనల ప్రకారం అమ్మకం ద్వారా వచ్చే మొత్తం నుంచి ప్రభుత్వం 12% రాయల్టీని మినహాయించుకుంటుందని రవి పటేల్ తెలిపారు. మిగిలిన సొమ్మును ఆ ఏడుగురు కూలీలకు సమానంగా పంచనున్నారు.ముగ్గురు కూలీల పెళ్లి కలఈ వజ్రం దొరకడం వల్ల సంతోష్, శర్మన్, అరుణ్ అనే ముగ్గురు కూలీల కుటుంబాలకు ప్రత్యేక ఊరట లభించింది. వీరికి 30 ఏళ్లు దాటిపోయినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇన్ని రోజులు పెళ్లిళ్లు వాయిదా పడుతూ వచ్చాయి. వజ్రం అమ్మకం ద్వారా వచ్చే వాటాలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఈ ముగ్గురు భావిస్తున్నారు. ఇది తమ ఉమ్మడి శ్రమ, సమష్టి కృషి ఫలితమని, అందరం కలిసి పనిచేశాము కాబట్టి రాయల్టీ పోను మిగిలిన మొత్తాన్ని సమానంగా పంచుకుంటామని చెప్పారు.వజ్రం విక్రయం ద్వారా వచ్చే డబ్బును ఏం చేయాలనే దానిపై కూలీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రేకుల షెడ్డుల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించుకోవడం, తమ పిల్లలకు మంచి చదువు అందించడమే మొదటి ప్రాధాన్యత అని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ 17.96 క్యారెట్ల వజ్రాన్ని పన్నాలోని ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో భద్రపరిచారు.





