
ఆగిన ఇండోర్‌ స్టేడియాల నిర్మాణం న్యూస్‌టుడే, కర్నూలు క్రీడలు : క్రీడాకారుల ప్రయోజనార్థం ప్రతి నియోజకవర్గంలో ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాకు 14 ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రాలు మంజూరు చేశారు. ఒక్కోదానికి రూ.2 కోట్ల వరకు కేటాయించారు. ఆత్మకూరు, డోన్, నంద్యాల, గూడూరు, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు కేంద్రాల్లో పనులు పూర్తి చేశారు. బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, పరుగు పందెం వంటి క్రీడల్లో సాధన చేసేలా సౌకర్యాలు సమకూర్చారు. నందికొట్కూరు, బనగానపల్లి, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, మంత్రాలయం, ఆదోని, వీనస్‌ కాలనీ (కర్నూలు), తడకనపల్లి (కల్లూరు) ప్రాంతాల్లో అర్ధాంతరంగా ఆగిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా బిల్లులు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ‘కూటమి’ ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని క్రీడాకారులు విన్నవిస్తున్నారు. న్యూస్‌టుడే, ఆదోని క్రీడలు : పశ్చిమ ప్రాంతంలో ఆదోని క్రీడాకారులకు అడ్డా. వీరికి ఉపయుక్తం ఉండేలా 2017-18లో తెదేపా ప్రభుత్వం ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విట్టాకిష్టప్పనగర్‌లో నిర్మించే భవనానికి రూ.2 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణ సంస్థకు పనులు అప్పగించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. వైకాపా పాపం.. క్రీడాకారులకు శాపం న్యూస్‌టుడే, నందికొట్కూరు : పట్టణంలో 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.1.30 కోట్ల వ్యయంతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టారు. సుమారు రూ.40 లక్షలతో బేస్‌మట్టం వరకు పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత 2019లో వైకాపా ప్రభుత్వం దీనిని పక్కన పెట్టేసి 2023లో రూ.2.38 కోట్లతో శివారులో ఇండోర్‌ స్టేడియం నిర్మించారు. షటిల్‌ బ్యాడ్మింటన్‌కు సంబంధించి నాలుగు కోర్టులు ఏర్పాటు చేశారు. పట్టణానికి దూరంగా ఉండటంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. తాజాగా రూ. 2 కోట్లు మంజూరు న్యూస్‌టుడే, బనగానపల్లి : ఏడేళ్లకుపైగా నిలిచిన ఇండో స్టేడియం పనులకు మోక్షం లభించింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గత తెదేపా హయాంలో 2018లో ప్రారంభించిన స్టేడియం పిల్లర్ల దశలో ఆగిపోయింది. అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చినా పట్టించుకోకపోవడంతో దిష్టిబొమ్మలా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల రూ.2 కోట్లు మంజూరు చేశారు. చిల్లిగవ్వ ఇవ్వని గత సర్కారు కర్నూలు నగరంలో వీనస్‌ కాలనీలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి 2018లో తెదేపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించింది. కొంత వరకు పనులు చేపట్టారు. నిర్మాణం పూర్తయి ఉంటే వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్, సంతోష్‌ నగర్‌ కాలనీ వాసులకు ఎంతో ప్రయోజనం. కానీ వైకాపా ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




