

- రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం..
- కాంగ్రెస్‌పై కొండా మురళి కీలక వ్యాఖ్యలు
- వరంగల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం
Konda Murali : కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ, కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమన్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ వరంగల్‌లో పార్టీ కార్యకర్తలతో కొండా దంపతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను గెలిపించడంలో రాహుల్ గాంధీ పాత్ర ఉందని చెప్పారు.
పదవులు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయన్న ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే (Konda Murali) ముఖ్యమన్నారు. తమ కుటుంబంలో కృతజ్ఞత అనేది రక్తంలోనే ఉందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖను ‘సారీ’ చెప్పాలని కోరినప్పటికీ పదవి ఉంటే ఉండనీ, పోతే పోనీ అంటూ ఆమె సారీ చెప్పలేదని మురళి తెలిపారు. ఎన్ని రోజులు బతికామన్నది కాదని, ఎలా బతికామన్నదే ముఖ్యమని అన్నారు.
కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం :
కాంగ్రెస్ పార్టీని వీడబోయేది లేదని కొండా దంపతులు మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడవొద్దని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకుడు లేరని, తన కారు రంగు ఇండియాలో మరెవరికీ ఉండదని అది ముస్లింలకు చిహ్నమని చెప్పారు.
ఆరోపణలపై కొండా మురళి సవాల్ :
తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తనపై నమ్మకం ఉంచుకుని చాలా మంది నాయకులు ఉన్నారన్నారు. కొండా మురళి మాటంటే మాటే అని అన్నారు. తన శరీరంలో ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయని, కార్యకర్తల ఆశీస్సులే తనను బతికిస్తున్నాయని చెప్పారు. కార్యకర్తల కోసం మరో 10 ఎకరాలు అయినా అమ్ముతానని, కార్యకర్తలే తన బలమని వ్యాఖ్యానించారు.
వరంగల్ తూర్పుపై బాధ్యతలు :
వరంగల్ తూర్పులో 24 మంది కార్పొరేటర్లను గెలిపిస్తానని కొండా మురళి ఈ సందర్భంగా ప్రకటించారు. వరంగల్ తూర్పు బాధ్యతలను నవిన్ రాజ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసే, గెలిచే వ్యక్తికే కార్పొరేటర్ టికెట్ దక్కుతుందని చెప్పారు.
తనకు, తన కుమార్తె సుస్మితకు సంబంధం లేదని మురళి అన్నారు. కొండా సురేఖది తనది ఒకే మాట అని, సుస్మితది మాత్రం వేరే మాట అని వ్యాఖ్యానించారు. రేవంత్ అన్నకు అన్నీ తెలుసని, ఢిల్లీ రావాలని తనకు ఫోన్ వచ్చిన విషయం నిజమేనని తెలిపారు.
