
కరీంనగర్: పీజీ సీటు రాలేదనే మనోవేదనతో ఎంబీబీఎస్‌ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. పసుల గౌతమ్ (39) ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ధర్మారం మండలంలోని నందిమేడారం, చొప్పదండి మండలంలోని కటికనపల్లి గ్రామాల్లో ఉన్న పీహెచ్‌సీల్లో వైద్యుడిగా విధులు నిర్వహించాడు. సుమారు నెల రోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. గౌతమ్ గతంలో రెండు సార్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసినప్పటికీ, మెరిట్ మార్కులు రాకపోవడంతో పీజీ సీటు లభించలేదు. దీంతో కొంతకాలంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి గౌతమ్ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రించాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తల్లి లేచి చూడగా గౌతమ్ బెడ్‌రూమ్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. తల్లిదండ్రులు వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి అతడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కుమారుడి మరణంపై ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుడు గౌతమ్ తండ్రి ఇరిగేషన్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




