
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఒడిపిలవంచ, గూడూరు, వీరాపూర్ చెరువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాటారం-మంథని రహదారి అధ్వానంగా మారినా కనీసం మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. చెరువుల మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరంతా గోదావరిలో కలుస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన నిర్వహణ లేకపోవడంతో మేడిగడ్డ వద్ద నుంచి నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని పేర్కొన్నారు. వెంటనే చెరువులను పునరుద్ధరించి సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు జక్కు రాకేశ్, జోడు శ్రీనివాస్, పంతకాని సడవలి, తోట జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





