
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): చారిత్రక, విద్యా, సామాజిక ప్రాధాన్యత కలిగిన జా మియా నిజామియా విద్యాసంస్థకు చెందిన రాయదుర్గం వక్ఫ్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ‘జామియా నిజామియా-రాయదుర్గం వక్ఫ్ ప్రొటెక్షన్, వక్ఫ్ బచావ్ తహ్రీక్ జాయింట్ యాక్షన్ కమిటీ’ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్ వద్ద ధర్నా నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దు ల్ వాహబ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాకు వివి ధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మతపెద్దలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. జామియా నిజామియా సంస్థ శతాబ్దానికిపైగా విద్యారంగంలో విశేష సేవలందిస్తున్నదని, భవిష్యత్ తరాల కోసం ఈ సంస్థ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని వక్తలు స్పష్టంచేశారు. రాయదుర్గం-పన్మక్త పరిధిలోని సర్వే నంబర్ 83/1లోని సుమారు 510.35 ఎకరాల జామియా నిజామియా వక్ఫ్ భూమి విషయంలో జరుగుతు న్న వివాదంపై జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇందులో ఇప్పటికే సుమారు 10.63 ఎకరాల భూ మిపై టీజీఐఐసీ వేలం ప్రక్రియలోకి వెళ్లగా, దాని విలువ సుమారు రూ.2,889 కోట్లుగా అంచనా వేసినట్టు నేతలు గుర్తుచేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ‘ఈ వేలంతో వచ్చే ఆదాయం జామియా నిజామియాకే కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మిగిలిన 500 ఎకరాల భూమిపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి హద్దు లు నిర్ణయించి ప్రహరీ నిర్మించాలి. జామియా నిజామియా ప్రతిపాదించిన ‘సిల్ అండ్ హెల్త్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ప్రభుత్వం పాలనాపరమైన, సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేసి ఆక్రమణల నివారణకు ప్రత్యేక రక్షణ కల్పించడంతోపాటు ఈ అంశంపై శాసనసభలో చర్చించి స్పష్టమైన హామీ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.




