
హార్మూజ్ జలసంధి గుండా సాగే నౌకా రవాణాపై ఇరాన్, గల్ఫ్ దేశాల ప్రతినిధులు ఒమన్‌లో సమావేశమయ్యారు. వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలు, వాటిపై విధించే ఫీజులకు సంబంధించి రెండు పక్షాల మధ్య సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ చర్చల ద్వారా ఎటువంటి ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. హార్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే ప్రతి నౌక నుంచి ప్రత్యేక రుసుము వసూలు చేయాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు అంటే 1/5వ వంతు చమురు కేవలం ఈ హార్మూజ్ జలసంధి గుండానే రవాణా అయ్యేది. అయితే యుద్ధం తీవ్రతరం కావడం వల్ల ఇరాన్ ఈ కీలకమైన వాణిజ్య మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ మార్గాన్ని మళ్లీ తెరవడానికి, నౌకల రవాణాకు అనుమతించడానికి ఇరాన్ కొన్ని షరతులు విధించింది. అందులో భాగంగానే తమ జలాల మీదుగా వెళ్లే నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్ ప్రతిపాదించిన ఫీజుల వసూలు విధానంపై గల్ఫ్ దేశాలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఒమన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో రెండు వర్గాల మధ్య అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, ఒక స్పష్టమైన ఒప్పందానికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ మార్గం పునఃప్రారంభం కాకపోతే అంతర్జాతీయంగా చమురు మార్కెట్ మరింత ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఐర్లాండ్‌లోని గోల్ఫ్ రిసార్ట్‌లో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందించారు. అక్కడ జరుగుతున్న సమావేశంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అక్కడ దేశాలు ఏం చేసుకున్నా తనకు ఇబ్బంది లేదని తెలిపారు. తమ మిత్రదేశాలు, ఇజ్రాయెల్ సంతోషంగా ఉంటే అంతకంటే కావలసిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పడిపోతాయని ఆయన పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిపై ఒమన్‌లో జరుగుతున్న చర్చలు ఎలాంటి తుది నిర్ణయానికి దారితీస్తాయో చూడాల్సి ఉంది.





