
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణేశుడి విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. విగ్రహ విక్రేతల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల చౌరస్తాలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. చౌదరిగూడ గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు జోడిమెట్ల చౌరస్తాకు వెళ్లాడు. అక్కడ విగ్రహాలు అమ్ముతున్న వ్యాపారులతో ధర విషయంలో బేరసారాలు జరుగుతుండగా మాటామాటా పెరిగింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో విగ్రహ తయారీదారులు, విక్రేతలు ఒక్కసారిగా కిరణ్, అతని స్నేహితులపై కర్రలతో దాడికి దిగారు.