ITR Defective Notice : వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 2026, జులై 31తోనే ఐటీ రిటర్న్స్ గడువు ముగిసింది. ఇందులో విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వ్యాపార ఆదాయం లేని వ్యక్తులు ఉంటారు. అయితే ఐటీఆర్ ఫైల్ చేస్తేనే అంతా అయిపోదు. ముఖ్యంగా ఐటీఆర్ ఫైల్ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఇ- వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. అప్పుడే అది వాలిడ్‌గా పరిగణిస్తారు. లేకపోతే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా సమస్య ఉంటే అంటే ఐటీఆర్‌లో ఏదైనా తప్పుగా ఉన్నా మీకు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తుంటాయి. అందుకే టాక్స్ పేయర్లు ఎప్పటికప్పుడు మెయిల్స్, ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్, కంప్లయిన్స్ పోర్టల్ వంటివి చెక్ చేస్తుండాలి.ఐటీఆర్‌లో ఏదైనా తప్పు ఉండటం లేదా వివరాల్లో తేడాలు ఉంటే ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు రావొచ్చు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి నోటీసు సమస్యను తెచ్చిపెడుతుందని కాదు. కొన్ని నోటీసులు కేవలం సమాచారం అందించడానికి, వివరాల్ని నిర్ధరించుకోవడానికి ఇస్తాయి. అందుకే ఇక్కడ ఏ నోటీసు ఎందుకొచ్చింది, వాటికి ఎలా స్పందించాలి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఐటీ శాఖ నుంచి ఏయే కారణాలతో ఏయే నోటీసులు వస్తాయనేది చూద్దాం.సెక్షన్ 143(1)(a) నోటీసులు- మీ ఐటీఆర్ ప్రాసెస్ చేసే సమయంలో ఇన్‌కం,డిడక్షన్స్, టాక్స్ క్రెడిట్లు ఇంకేదైనా వివరాల్లో తేడాలుంటే నోటీసులు రావొచ్చు. ఇక్కడ మీ నోటీసుల్లో చూయించిన మార్పుల్ని టాక్స్ రికార్డులతో చెక్ చేయాలి. తప్పులుంటే సరైన వివరాలు, ఆధారాలతో ఆన్లైన్లో బదులివ్వాలి.సెక్షన్ 139(9) నోటీసులు- ఇక్కడ మీరు ఫైల్ చేసిన ఐటీఆర్‌లో అవసరమైన సమాచారం లేకపోయినా ఇంకా మీరు ఇచ్చిన వివరాలు అసంపూర్తిగా ఉన్నా, ఇతర లోపాలున్నా ఈ డిఫెక్టివ్ రిటర్న్ నోటీసు ఇస్తారు. ఇక్కడ కూడా నోటీసుల పేర్కొన్న తప్పుల్ని సరిచేయాలి. గడువులోగా కచ్చితంగా స్పందించాలి.సెక్షన్ 142(1) నోటీసు- ఆదాయం లేదా టాక్స్ లెక్కల్ని పరిశీలించడానికి ఇంకా సమాచారం కావాలంటే, డాక్యుమెంట్లు లేదా ఇతర వివరణ కోసం ఈ నోటీసులు రావొచ్చు.అడిగిన డాక్యుమెంట్లు, వివరాల్ని గడువులోపు సమర్పించాలి.సెక్షన్ 143(2) నోటీసు- మీ ఐటీ రిటర్న్స్‌ను స్క్రూటినీ కోసం చూసినప్పుడు ఈ నోటీసులు వస్తాయి. ఇక్కడ ఆదాయం, మినహాయింపులు, తగ్గింపులు వంటి వివరాల్ని పరిశీలిస్తారు. ఈ నోటీసును నిర్లక్ష్యం చేయకుండా సమయానికి స్పందించాలి.సెక్షన్ 148 నోటీసు- గతంలో మీరు పేర్కొనని ఆదాయం ఉందని లేదా ఆదాయం అంచనా వేయడంలో ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే రీ అసెస్మెంట్ కోసం ఈ నోటీసు రావొచ్చు. ఇక్కడ నోటీసులు ఎందుకు వచ్చాయో పరిశీలించి, అవసరమైన రిటర్న్, వివరణ ఇవ్వాలి. ఇలాంటి కేసుల్లో టాక్స్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.సెక్షన్ 245 నోటీసులు- మీకు రావాల్సిన టాక్స్ రిఫండ్‌ను వేరే అసెస్మెంట్ ఇయర్లో ఉన్న పాత టాక్స్ డిమాండ్‌కు సర్దుబాటు చేయాలని ఐటీ శాఖ భావిస్తే ఈ నోటీసులు పంపొచ్చు. ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకొని స్పందించాలి.Read Also: అడ్వాన్స్ టాక్స్ చెల్లించారా? అసలు ఇదెవరికి అవసరం, ఎంత కట్టాలి? డెడ్‌లైన్స్ సహా పూర్తి వివరాలివేసెక్షన్ 154 నోటీసులు- టైపింగ్, లేదా ఇతర పొరపాట్లను సరిచేయడానికి ఈ నిబంధనలు ఉపయోగించవచ్చు. చేయబోయే మార్పుల్ని పరిశీలించాలి. నిజంగా తప్పులుంటే అంగీకరించవచ్చు. తప్పుగా ఉంటే సరైన ఆధారాలు, కారణాలతో స్పందించాలి.సెక్షన్ 263 నోటీసులు- అసెసింగ్ అధికారి ఇచ్చిన అసెస్మెంట్ ఆర్డర్లో తప్పుందని, దాని వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏదైనా నష్టం జరుగుతుందని కమిషనర్ భావించినప్పుడు ఈ నోటీసు రావొచ్చు. ఇక్కడ ఆర్డర్ ఎందుకు తప్పు కాదో వివరించేలా సమాధానం ఉండాలి. అవసరమైన ఆధారాల్ని సమర్పించాలి. ఈ కేసుల్లో కూడా టాక్స్ నిపుణుల సలహా తీసుకోవాలి.నోటీసులు వస్తే ఏం చేయాలి?ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చిన వెంటనే భయపడాల్సిన పని లేదు. ముందుగా అవి నిజంగా ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చాయో లేదో ఇ- ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించుకోవాలి. తర్వాత నోటీసులు ఏం పేర్కొన్నారో చదవాలి. ఆ తర్వాత మీరు టీడీఎస్ వివరాలు, ఐటీఆర్, ఫారం- 16, బ్యాంక్ డీటెయిల్స్, డిడక్షన్‌కు సంబంధించిన పత్రాల్ని పరిశీలించాలి. అవసరమైన దగ్గర ఆధారాలతో సమాధానం ఇవ్వాలి. ముఖ్యంగా నోటీసులో ఇచ్చిన గడువు మిస్ కాకుండా చూసుకోవాలి.





