
హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో దారుణమైన ఘటన జరిగింది. అప్పటి వరకూ ఆఫీస్ లో విధులు నిర్వర్తిస్తూ ఉన్న ఓ యువతి సెల్ ఫోన్ రిపేర్ కోసం బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోయింది. అమీర్ పేట్ లోని శ్రీనగర్ కాలనీలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో హేమదుర్గ(26) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన హేమదుర్గ బంజారాహిల్స్ లోని ఓ కార్ల షోరూమ్ లో పనిచేస్తుంది. స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ రోజూ విధులకు హాజరవుతుంది. అయితే రోజూవారీ మాదిరిగానే సెప్టెంబర్ 12న కూడా ఆఫీస్ కు వెళ్లింది. అయితే హేమదుర్గ ఆఫీస్ లో ఉన్నప్పుడు తన ఫోన్ రిపేర్ వచ్చింది. ఫోన్ పనిచేయకపోవడంతో ఆఫీస్ పర్మిషన్ తీసుకుని ఫోన్ రిపేర్ కోసం అమీర్ పేటకు రాపిడో బుక్ చేసుకుని బైక్ పై వెళ్లింది. రాపిడో బైక్ అమీర్ పేట్ బిగ్ బజార్ వెనుక గేట్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు రాపిడో బైక్ ను ఢీ కొట్టింది.
దాంతో ఒక్కసారిగా రాపిడో డ్రైవర్, హేమదుర్గ ఎగరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. రాపిడో డ్రైవర్‌ కూ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతడ్ని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువతి మృతికి కారణమైన బస్సు డ్రైవర్‌ ను అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంటలో ఫోన్ రిపేర్ చేయించుకుని వస్తానని వెళ్లిన తమ కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలియడంతో భీమవరంలోని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత భవిష్యత్తు కోసం హైదరాబాద్ కు వచ్చిన యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె స్నేహితులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






