

- అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించలేదా? వెంటనే ఇలా చేయండి
- అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు సెప్టెంబర్ 15 గడువు మాత్రమే
- ఈ ట్యాక్స్‌లో 36శాతం రూల్ ఏంటి? ఇంకా వడ్డీ కట్టాల్సిన పనిలేదా?
- జీతంతో పాటు ఇతర ఆదాయం ఉందా? అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్ ఇదే
Advance Tax Deadline : అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించలేదా? ఈరోజే (సెప్టెంబర్ 15) లాస్ట్ డేట్.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ను సెప్టెంబర్ 15లోగా చెల్లించాలి.
ముఖ్యంగా జీతంతో పాటు బ్యాంక్ వడ్డీ, డివిడెండ్లు, స్టాక్ మార్కెట్ లాభాలు, ఫ్రీలాన్సింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు ఈ టాక్స్ గడువును తప్పకుండా గుర్తుంచుకోవాలి. ముందస్తు పన్నును జమ చేయలేకపోయినా, తక్కువ జమ చేసినా, డిసెంబర్ 15వ తేదీన వచ్చే వాయిదా కోసం వేచి ఉండవద్దని పన్ను నిపుణులు సలహా ఇస్తున్నారు.
సాధారణంగా, టీడీఎస్, టీసీఎస్ మినహాయించిన తర్వాత ఏడాదికి చెల్లించాల్సిన పన్ను రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ (Advance Tax Deadline) తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నును 4 విడతల్లో చెల్లించే విధానం ఉంది. అందులో జూన్ 15 నాటికి 15శాతం, సెప్టెంబర్ 15 నాటికి 45శాతం, డిసెంబర్ 15 నాటికి 75శాతం, మార్చి 15 నాటికి 100శాతం పన్ను చెల్లించాలి.
36 శాతం రూల్ ఇదేనా? :
ప్రస్తుతం సెప్టెంబర్ వాయిదాలో కీలక 36శాతం రూల్ ఉంది. సెప్టెంబర్ 15 నాటికి మొత్తం అంచనా పన్నులో కనీసం 36శాతం చెల్లిస్తే కొన్ని పరిస్థితుల్లో 45శాతం లక్ష్యాన్ని చేరుకోకపోయినా సెక్షన్ 234C కింద వడ్డీ తప్పించుకోవచ్చు.
36శాతం కన్నా తక్కువ చెల్లిస్తే మాత్రం వర్తించే మొత్తంపై వడ్డీ పడవచ్చు. గడువు మిస్ అయితే వెంటనే మీ వార్షిక పన్ను బాధ్యతను మళ్లీ లెక్కించుకోవాలి. టీడీఎస్ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వీలైనంత త్వరగా చెల్లించడం మంచిది.
ఆలస్యం పెరిగే కొద్దీ వడ్డీ భారం కూడా పెరగవచ్చు. అలాగే AIS (Annual Information Statement)లో మీ వడ్డీ, డివిడెండ్, క్యాపిటెల్ గెయిన్స్ వంటి ఆదాయ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం ముఖ్యం. తప్పులు ఉంటే సరిచేసుకోవాలి. నెక్ట్స్ అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదాలకు అనుగుణంగా పేమెంట్లు చేయడం ద్వారా అనవసరమైన వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ముందస్తు పన్ను ఏంటి? :
ఒక్క మాటలో చెప్పాలంటే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మీరు సంపాదించినప్పుడే పన్నులు చెల్లించే విధానం. ఆదాయపు పన్ను చట్టం, 2025లోని సెక్షన్లు 403 నుంచి 410 వరకు ప్రకారం, పన్ను చెల్లింపుదారులు సంవత్సరం చివరలో తమ వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాలి. ఆ సమయంలో తమ పూర్తి పన్నును ఒకేసారి కాకుండా 4 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పన్ను ఎవరు చెల్లించాలి? :
టీడీఎస్, టీసీఎస్ మినహాయింపు తర్వాత మీ అంచనా వార్షిక పన్ను బాధ్యత రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. మీరు ముందస్తు పన్ను చెల్లించడం తప్పనిసరి. ఇందులో జీతం తీసుకునే వ్యక్తులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారవేత్తలు, సీనియర్ సిటిజన్లు (వ్యాపార ఆదాయం లేని వారు మినహా) అందరికి వర్తిస్తుంది.
గడువు దాటితే వడ్డీ ఎంత కట్టాలి? :
ఈరోజు చెల్లింపు చేయకపోతే లేదా తక్కువ పేమెంట్ చేస్తే.. ఎంత మొత్తంలో అధిక వడ్డీ వసూలు చేస్తారు. మొత్తం పన్ను బాధ్యతలో 45శాతం జమ చేయడంలో విఫలమైతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234C ప్రకారం వడ్డీ భారీగా పడుతుంది. చెల్లించని మొత్తంపై 3 నెలల పాటు నెలకు ఒక శాతం చొప్పున (మొత్తం 3శాతం వడ్డీ) వసూలు చేస్తారు.
మార్కెట్ నిపుణుల ప్రకారం.. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి మీ మొత్తం పన్నులో కనీసం 36శాతం చెల్లించి ఉంటే.. లక్ష్యం 45శాతం అయినప్పటికీ మీకు ఎలాంటి వడ్డీ పడదు. అయితే, మీ మొత్తం పేమెంట్ 36శాతం కన్నా తక్కువగా ఉంటే పూర్తి 45శాతం లక్ష్యం కన్నా తక్కువగా మిగిలిన మొత్తంపై వడ్డీ కూడా లెక్క కడతారు.
సెక్షన్ 234B రూల్ :
ఒకవేళ ఏడాది మొత్తానికి మీ మొత్తం ముందస్తు పన్ను మార్చి 31 నాటికి ఉన్న మొత్తం బాధ్యతలో 90శాతం కన్నా తక్కువగా ఉంటే అప్పుడు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నెలకు ఒక శాతం అదనపు వడ్డీ (సెక్షన్ 234B) కూడా క్రెడిట్ అవుతుంది.