
ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేయడంపై మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పద్ధతి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ఓటర్లను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. ఎన్నికల తర్వాత వెంటనే రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యేల అంశాన్ని పరిశీలించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా మార్గదర్శకాలను రూపొందించాలని ఎన్నికల సంఘానికి ( Election Commission ) సూచించింది. రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధురాంతకం, ధారాపురం సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలుపొందిన కొందరు ఎమ్మెల్యేలు కొన్ని రోజులకే రాజీనామా చేసి అధికార టీవీకేలో ( TVK ) చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు స్థానాలకు అక్టోబర్‌ 6న ఉప ఎన్నిక (Tamil Nadu By Election) జరగనుంది. దీనిని సవాలు చేస్తూ చెన్నైకి చెందిన ఓ న్యాయవాది మద్రాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. ఎన్నికైన కొద్దికాలానికే రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక ఖర్చు పన్నుచెల్లింపుదారులు భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి వారిని నిర్దిష్ట కాలం పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించేందుకు చట్టం తీసుకురావాలని కోరారు. దీనిపై స్పష్టత వచ్చేవరకు ఉప ఎన్నికలు నిర్వహించకుండా స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఝీరాం వ్యాలీ ఘటన.. 10 మంది మావోలకు మరణశిక్ష దీనిని విచారించిన జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్‌ గోవిందరాజన్‌లతో కూడిన ధర్మాసనం.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత దానిని ఆపలేమని పేర్కొంది. అయితే, ఎన్నికైన వెంటనే ఓ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి.. ఆ ఉప ఎన్నికలో వాళ్లే పోటీ చేసే పద్ధతిని విచిత్ర పరిస్థితిగా పేర్కొంది. ఇలాంటి ధోరణులను పరిశీలించి ఓ పరిష్కార మార్గంతో వస్తారని ఆశిస్తున్నట్లు ఎన్నికల సంఘానికి సూచించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





