
Gold buying guide | ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల చెన్నైలోని ఓ జువెలరీ దుకాణంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) అధికారులు తనిఖీలు నిర్వహించారు. విక్రయానికి ఉంచిన హాల్‌మార్క్‌ లేని 804 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హాల్‌మార్కింగ్‌ లేని బంగారాన్ని విక్రయించకూడదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా.. యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ హాల్‌ మార్కింగ్‌ అంటే ఏమిటి? బంగారం కొనుగోలు చేసే ముందు ఏమేం చూడాలి? బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకొనేందుకు ‘హాల్‌మార్క్‌’ విధానాన్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS)’ రూపొందించింది. దీని ఆధారంగా నగపై ముద్రించిన మూడు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది - BIS స్టాండర్డ్‌ మార్క్‌. రెండోది - స్వచ్ఛత గ్రేడ్‌. మూడోది - HUID నంబర్‌. 2021 నుంచే బంగారు నగలపై ఈ హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇది త్రిభుజాకారంలో ఉండే గుర్తు. ఆభరణం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తనిఖీ చేశామని, అందులో వాడిన బంగారం ప్రామాణికమైనదని ధ్రువీకరిస్తుంది. కాబట్టి ఎంచుకునే నగపై ఈ గుర్తును ముద్రించారో లేదో చెక్‌ చేసుకోవాలి. బంగారంపై ముద్రించిన క్యారెట్స్‌ సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి. 24 క్యారట్ల బంగారాన్ని వంద శాతం స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అయితే, ఈ బంగారంతో నగల తయారీ సాధ్యం కాదు గనక వెండి, రాగి, జింక్‌ వంటి ఇతర లోహాల్ని కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. ఇలా తయారైన నగల్లో అసలు బంగారం ఎంత శాతం? ఇతర లోహాలు ఏ మోతాదులో కలిపారు? అనే వివరాలు తెలుసుకోవచ్చు. బంగారు ఆభరణంపై ఉండే HUID (హాల్‌మార్క్‌ యునిక్‌ ఐడెంటిఫికేషన్‌) నంబర్‌ కూడా అవసరమే. ప్రతి నగల వ్యాపారి ఈ ఆరంకెల ఆల్ఫాన్యూమరిక్‌ ఉన్న ఆభరణాల్నే విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి వ్యక్తికి ఆధార్‌ ఉన్నట్లే ప్రతి ఆభరణానికీ ఒక ప్రత్యేకమైన HUID నంబర్‌ని కేటాయిస్తారు. ఈ కోడ్‌ సాయంతో కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛమైందో, కాదో స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘BIS Care’ అనే యాప్‌ కూడా అందుబాటులో ఉంది. యాప్‌ ఓపెన్‌ కాగానే ‘Verify HUID’ అని కనిపించే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆపై బంగారు ఆభరణం మీద ఉన్న HUID నంబర్‌ని అందులో ఎంటర్‌ చేయాలి. తద్వారా నగకు సంబంధించిన హాల్‌మార్కింగ్‌ వివరాలన్నీ ఓ షీట్‌ రూపంలో కనిపిస్తాయి. హాల్‌మార్క్‌ చేసిన కేంద్రం, ఆభరణం, స్వచ్ఛత.. తదితర విషయాలన్నీ స్వయంగా తెలుసుకోవచ్చు. దుకాణదారుడు ఇచ్చే బిల్లుతో ఈ వివరాల్ని సరిపోల్చుకోవచ్చు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





