
నటుడు రామ్ జగన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివంగత నటుడు అచ్యుత్ మరణం, సినీ పరిశ్రమలో తన ప్రయాణంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్యుత్ మరణవార్త తనకు తీరని షాక్‌ను మిగిల్చిందని రామ్ జగన్ వివరించారు. తిరుపతికి రైలులో వెళ్తుండగా ఈ విషాద వార్త తెలిసిందని, వెంటనే ప్రయాణం రద్దు చేసుకొని తిరిగి వచ్చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. అచ్యుత్‌కు తాను చాలా సన్నిహితుడినని, చాలా మంచి వ్యక్తి అని, అందరితో ప్రేమగా ఉండేవాడని రామ్ జగన్ అన్నారు. ధూమపానం, మద్యపానం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని అచ్యుత్ చిన్న వయసులోనే మరణించడం నేటికీ చాలా మందికి ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిందని పేర్కొన్నారు. ఆయన మరణించినప్పుడు ఫిల్మ్ ఛాంబర్ వద్ద జన సందోహం ఆయన పట్ల ప్రజలకున్న అభిమానాన్ని తెలియజేసిందని వివరించారు.