
Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 13 : ‘వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనం రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయని’ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యావరణ సందర్భంలో ప్రజలకు హితబోధ చేస్తుంటారు.. ఇవన్నీ ఉచిత సలహాలేనా..? ఆ సూచనలు ప్రజలకు తప్ప తమకు కాదన్నట్టుంది రామగుండం నగర పాలక అధికారుల ధోరణి. పారిశ్రామిక ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజలకు నీడనిస్తూ, ప్రాణవాయువు అందించే వృక్షాల నరికివేత చర్యల పట్ల పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తా పోచమ్మ ఆలయం వద్ద 70 యేళ్ల నాటి భారీ వృక్షంను నేలమట్టం చేశారు.
అలాగే బస్టాండ్ సమీపంలోని చెట్లను అభివృద్ధి పనుల పేరుతో నరికివేశారు. ఈ చర్యలపై స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ సంఘటన మరువకముందే తాజాగా రెండు రోజుల క్రితం గోదావరిఖని రాజేష్ థియేటర్ వద్ద గల యేళ్ల నాటి భారీ వృక్షాలను సరికివేయడం వివాదాస్పదంగా మారింది. అధికారుల తీరుపై సామాజిక మాధ్యమం వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సిన అధికారులే ఇలా చెట్లను నరకడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
సామాన్యులు చెట్లను నరికితే కేసులు, జరిమానాలు విధించే నగర పాలక అధికారులకు ఇవి కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి హుంకరిస్తే అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందేనా అని విమర్శిస్తున్నారు. ఇప్పటికే చుట్టూ పరిశ్రమల ప్రభావంతో కాలుష్యపు కబంధపు హస్తంలో చిక్కుకున్న రామగుండంలో పర్యావరణంను పెంపొందించాల్సింది పోయి భారీ వృక్షాలను నరుక్కుంటూ పోతే గాలి నాణ్యత, ఉష్ణోగ్రతలు, నీడ, పచ్చదనంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందనీ, వేసవిలో ప్రకృతి ప్రయోజనాలు కోల్పోతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఒకవైపు కూల్చివేతలు జరుగుతుండగా.. మరోవైపు ప్రకృతి విధ్వంసం కు పాల్పడడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల నరికివేతకు పాల్పడిన బాధ్యులపై పర్యావరణ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






