
భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ హైదరాబాద్, న్యూస్‌టుడే: బడాబాబుల చేతిలో ఉన్న ప్రభుత్వ భూములను ‘22ఏ’లో పెట్టి చర్యలు తీసుకోవాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కోటీ రెండు లక్షల ఎకరాల భూముల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. సహచర ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, వెంకటరమణారెడ్డి, రామారావు పాటిల్‌ తదితరులతో కలిసి ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘‘మంత్రులు, సీఎం గంటలతరబడి మాట్లాడారు. కానీ, మాకు సమయం ఇవ్వలేదు. మేం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఎసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్‌... మిగతా భూముల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. 23 లక్షల ఎకరాలు దోపిడీకి గురయ్యాయని అంటున్నారు.. ఆ వివరాలు బహిర్గతం చేయాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూదాన్‌ భూములపై స్పష్టత ఇవ్వలేదు. నిషేధిత జాబితాలో ఉన్న, ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి. పార్ట్‌-1బీలో ఉన్న 20 లక్షల ఎకరాల్లోంచి 5 లక్షల ఎకరాలను ఎందుకు తొలగించారు.. మిగతా భూములను పార్ట్‌-1బీలోనే ఎందుకు ఉంచారో ప్రజలకు చెప్పాలి. భూ అక్రమాల వ్యవహారంపై ప్రశ్నించడంలో భాజపా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’ అని మహేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





