
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దుర్వినియోగంపైనే ప్రధాన దృష్టి ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు బుధవారం తనిఖీలు చేపట్టాయి. జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యులతోపాటు విజిలెన్స్‌ అధికారులతో కూడిన బృందాలు ఉదయం నుంచి కళాశాలల్లో తనిఖీలు మొదలుపెట్టాయి. ఒక్కో బృందంలో 10-12 మంది సభ్యులున్నారు. రాత్రి 8.30 గంటల వరకు కూడా తనిఖీలు పూర్తికాలేదు. తొలిరోజు స్టాన్లీ మహిళా కళాశాల, ఏస్‌ కళాశాల, వాసవి, సీబీఐటీ, అన్నమాచార్య కళాశాలల్లో తనిఖీలు జరిగాయి. ‘రాష్ట్రంలో కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో అవకతవకలకు పాల్పడ్డాయి.. అందుకే క్లీన్‌చిట్‌ ఉన్న వాటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు క్లియర్‌ చేస్తాం.. మిగిలిన వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం’ అని మూడు రోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన క్రమంలోనే తనిఖీలు మొదలయ్యాయి. తనిఖీ బృందాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, విద్యార్థులు, ల్యాబ్‌లున్నాయా? లేవా? నిబంధనల మేరకు అధ్యాపకులు తగినంత మంది ఉన్నారా? తదితర అన్ని అంశాలను పరిశీలిస్తున్నాయి. నిబంధనల ప్రకారమే భవనాలు నిర్మించారా? అనుమతులు ఉన్నాయా? తదితర వాటిని కూడా పరిశీలిస్తున్నారని, అందుకే ఆర్కిటెక్ట్‌లు కూడా బృందంలో ఉన్నారని చెబుతున్నారు. రోజూ నాలుగైదు కళాశాలల చొప్పున మరికొన్ని రోజులు ఈ తనిఖీలు కొనసాగనున్నాయని చెబుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





