
ప్రభుత్వానికి కేటీఆర్‌ డిమాండ్‌ ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షతో పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టొద్దని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లు అందించాలని కేటీఆర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్‌ పంపులను ప్రారంభించి బుధవారం నాటికి మూడేళ్లయిన సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. ‘‘ఉమ్మడి పాలనలో కరవు, వలసలకు నిలయంగా ఉన్న పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కేసీఆర్‌ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత భారాస ప్రభుత్వానిది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలను తీర్చాలనేది ప్రణాళిక. 2023 సెప్టెంబరు 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి దశ వెట్‌ రన్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





