
గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టిన జాంగ్‌ యిమింగ్‌ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా సోషల్‌ మీడియా దిగ్గజం టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ అవతరించారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీని వెనక్కినెట్టారు. అంతర్జాతీయంగా కృత్రిమ మేధ (ఏఐ) అనుబంధ సంస్థల్లో భారీ వృద్ధి నమోదవుతుండటంతో, యిమింగ్‌ నికర సంపద 105 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10 లక్షల కోట్లు) మార్కును అధిగమించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ బుధవారం వెల్లడించింది. 43 ఏళ్ల జాంగ్‌ యిమింగ్‌ సంపద 2019 మార్చిలో 13 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం అది 8 రెట్లకు పైగా పెరిగింది. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థలు బ్లాక్‌రాక్, ఫిడెలిటీ, టి.రోవ్‌ ప్రైస్‌ తాజా వాల్యుయేషన్ల ప్రకారం.. ఒక్క ఈ నెలలోనే ఆయన సంపద విలువ 12 బి.డాలర్లకు పైగా పెరిగింది. జూన్‌లో అదానీ సంపద గరిష్ఠంగా 120 బిలియన్‌ డాలర్లకు చేరింది. అనంతరం ఎంఎస్‌సీఐ సూచీ రీబ్యాలెన్సింగ్, అంతర్జాతీయ ముడిచమురు ధరల పెరుగుదల, బాండు రాబడుల ఒత్తిడితో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు క్షీణించాయి. దీంతో అదానీని అధిగమించి యిమింగ్‌ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌గా మొదలైన టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ప్రస్థానం.. అనంతరం ఏఐ రంగంలోకి విస్తరించింది. సంస్థ రూపొందించిన డౌబావో చాట్‌బాట్, సీడ్యాన్స్‌ వీడియో జెనరేషన్‌ టూల్స్‌ భారీగా ప్రజాదరణ పొందాయి. అమెరికాలో నియంత్రణ సంస్థల ఇబ్బందులు, రాజకీయ భౌగోళిక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఏఐ పెట్టుబడులను యిమింగ్‌ ఏమాత్రం తగ్గించలేదు. టిక్‌టాక్‌ ద్వారా లభించే సోషల్‌ మీడియా డేటా, వారి ఏఐ మోడళ్ల అభివృద్ధికి ప్రయోజనకరంగా మారుతోందని పరిశోధన సంస్థ ఒమ్డియా విశ్లేషించింది. ఈ ఏడాది ప్రారంభంలో టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్లో కొంత భాగాన్ని స్థానిక పెట్టుబడిదార్లకు బదిలీ చేయడంతో, సంస్థపై ఉన్న అనిశ్చితి మేఘాలు క్రమంగా తొలగిపోయాయి. తాజా పరిణామం ఆసియా సంపన్నుల జాబితాలో వస్తున్న మార్పులను చూపిస్తోంది. గౌతమ్‌ అదానీకి చెందిన ఇంధనం-పోర్టులు- మౌలిక రంగం లేదా ముకేశ్‌ అంబానీ సంప్రదాయ భారీ పరిశ్రమల సంపదను.. కృత్రిమ మేధ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు సృష్టిస్తున్న న్యూఏజ్‌ సంపద అధిగమిస్తుండటం గమనార్హం. ఇప్పటికే చైనాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న యిమింగ్, తాజాగా ఆసియా కుబేరుడిగా మారారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




