
అ ది 1912. ఓ పందొమ్మిదేళ్ల కుర్రాడు ఊళ్లోకి ఒక బ్రిటిష్‌ అధికారి మోటార్‌సైకిల్‌ మీద రావడాన్ని చూశాడు. ఎడ్లు, గుర్రాల్లేకుండా అదెలా నడుస్తోందా అని ఆశ్చర్యపోయాడు. అలా దాని ప్రేమలో పడి, కోయంబత్తూరు వెళ్లి మూడేళ్లపాటు సర్వర్‌గా పనిచేసి, డబ్బు జమచేసి మరీ ఆ బైక్‌ కొన్నాడు. అది చూసి దానిమీద తనని షికారుకు తీసుకెళ్తాడనుకుని ఆనందంగా ముస్తాబవుతుంది భార్య. ఇంతలోనే బైక్‌ని ఏ భాగానికా భాగం విప్పేశాడతడు. అసలు ఆ యువకుడు దాన్ని కొన్నది అదెలా నడుస్తుందో తెలుసుకునేందుకే. పదిసార్లు విప్పి, బిగించి దాని పనితీరుని కనిపెట్టేశాడు. ఆ పట్టుదల, సంకల్పం, ఆసక్తులే అతణ్ని దక్షిణ భారతంలో వాణిజ్య, సాంకేతిక విప్లవానికి ఆద్యుడిగా చేశాయి. ఆయనే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తాజా బయోపిక్‌ నేపథ్యంలో ‘జీడీఎన్‌’ అంటే బాగా తెలుస్తుందేమో. ద ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియా, వెల్త్‌ క్రియేటర్‌ ఆఫ్‌ కోయంబత్తూర్, మిరకిల్‌ మ్యాన్‌... లాంటి పేర్లతో సుప్రసిద్ధులైన ఆయన కోయంబత్తూరు సమీపంలోని కలంగల్‌ గ్రామంలో తెలుగు కుటుంబంలో పుట్టారు. మూడో తరగతిలోనే చదువు మానేశారు కానీ, నేర్చుకోవడం ఆపలేదు. పగలు తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ రాత్రివేళ చదువుకునేవారట. చిన్నప్పటి నుంచీ జీడీఎన్‌కి యంత్రాలపై విపరీతమైన ఆసక్తి. బ్రిటిష్‌ వ్యాపారవేత్త రాబర్ట్‌ స్టాన్స్‌ నడిపే రెస్టరంట్‌లో పనిచేస్తూ ఇంగ్లిష్‌ నేర్చుకున్నారు. మెకానిక్‌గా పనిచేస్తున్న జీడీఎన్‌కి రుణం ఇప్పించడమే కాక తన బస్సుల్లో ఒకటి విక్రయించాడు స్టాన్స్‌. అలా 1920ల్లో ఒక్క బస్సుతో మొదలెట్టి ఆరు వందల బస్సులకు విస్తరించారు జీడీఎన్‌. యూనివర్సల్‌ మోటార్‌ సర్వీస్‌గా అభివృద్ధి చేసి, దేశంలోనే సమర్థమైన పబ్లిక్‌ రవాణాగా తీర్చిదిద్దారు. బొమ్మ కారులోని మోటారును షేవింగ్‌ రేజర్‌కు అమర్చి చేసిన ప్రయోగం ‘రసంత్‌’ ఎలక్ట్రిక్‌ రేజర్‌ ఆవిర్భావానికి దారితీసింది. నాణెం వేస్తే పనిచేసే ఫోనోగ్రాఫ్‌లు, ఎలక్ట్రానిక్‌ కాలిక్యులేటర్లు, రేడియో, కెమెరా లెన్స్, నారింజ రసం తీసేదీ, పత్తిని వడికేదీ... ఇలా నిత్యజీవితంలో ఉపయోగపడే దాదాపు వంద ఉత్పత్తుల్ని రూపొందించారు జీడీఎన్‌. ఓటింగ్‌ పరికరాలపైనా ప్రయోగాలు చేశారు. రెండు సీట్లు ఉన్న పెట్రోల్‌ కారు ఆయన ఆవిష్కరణల్లో ఒకటి. పత్తి, బొప్పాయి, మొక్కజొన్నల్లో కొత్త రకాలను గుర్తించారు. 1930లలో జీడీఎన్‌ రూపొందించిన విద్యుత్‌ మోటార్లు, వాటి విడి భాగాలు కోయంబత్తూరు పారిశ్రామిక అభివృద్ధికి దోహదంచేశాయి. ఆయన ఆవిష్కర్తే కాదు, గొప్ప దాత కూడా. దేశంలోనే తొలి పాలిటెక్నిక్‌ కాలేజ్‌ను కోయంబత్తూరులో స్థాపించారు. పట్టణ పేదలకోసం ఇళ్లను నిర్మించేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల కోసం 1950ల్లోనే జి.డి.సైన్స్‌ మ్యూజియం ఏర్పాటుచేశారు. జీడీఎన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థను మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సీవీ రామన్‌ వంటి ప్రముఖులు సందర్శించి, ఆయన సేవల్ని ప్రశంసించారు. ‘ఫిజిక్స్‌ చదువుకున్నవాళ్లు ఆ రంగంలోనే పరిశోధనలు చేయగలరు. మూడోతరగతే చదివిన నేను ఏ రంగంలోనైనా చేయొచ్చు’ అనేవారట నాయుడు. బ్రిటిషర్లు ఆయన వ్యాపారంపై కుట్రలు పన్ని, అధిక పన్నులు వేసి, ఆర్థిక నేరాలను మోపినా- ఏ మాత్రం కుంగిపోకుండా సమర్థంగా ఎదుర్కొన్న ధీశాలి. చేస్తూ నేర్చుకోవడంగా సాగిన జీడీఎన్‌ జీవితం నేర్పే పాఠం... నేటి సమాజానికి ఆదర్శమే కాదు, అవసరం కూడా! ఒకవైపు పెట్రోల్, డీజిల్‌ ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు చాలామంది విద్యుత్‌ వాహనాల (ఈవీల) వైపు మొగ్గుతున్నారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలూ ఈవీల కొనుగోళ్లకు ఊతమిస్తున్నాయి. ఆకర్షణీయమైన మోడళ్లలో పలు రకాల వాహనాలు అందుబాటులోకి వస్తుండటమూ అమ్మకాలను పెంచుతోంది. ఈ క్రమంలో ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ఇండియాలో నమోదైన విద్యుత్‌ వాహనాలు... (లక్షల్లో) .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




