
ప్రవాసులంటే కేవలం స్వదేశానికి డబ్బు పంపేవారు కాదు; దేశాభివృద్ధికి అవసరమైన జ్ఞానసంపదలు, సాంకేతికతలు, పెట్టుబడులు, ప్రపంచ అనుసంధానాన్ని తీసుకువచ్చే వ్యూహాత్మక భాగస్వాములు. పలు దేశాలు వారిని అలాగే గుర్తించి గౌరవిస్తున్నాయి. ప్రవాస సమాజ శక్తిని సద్వినియోగం చేసుకోవడంపై తెలుగు రాష్ట్రాలూ దృష్టిసారించాలి. భా రతీయ ప్రవాస సమూహం ప్రపంచంలోనే అతిపెద్దది. మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ మూలధన వనరులను అది సూచిస్తోంది. అందులో తెలుగు ప్రజల వాటా కూడా విశేషమైనదే. వైద్యులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, అధ్యాపకులు, పెట్టుబడిదారులుగా అనేక దేశాల్లో తెలుగువారు విశిష్ట స్థానాలు సంపాదించారు. ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక సంస్థల్లో, పరిశోధనా కేంద్రాల్లో, విశ్వవిద్యాలయాల్లో తెలుగు ప్రతిభ గణనీయంగా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలకు ఎంతో లాభం చేకూరుతుంది. ప్రవాసుల శక్తియుక్తులను సమర్థంగా వినియోగించుకున్న దేశాల్లో ఇజ్రాయెల్‌ ఒకటి. 1951లో ప్రారంభమైన ఇజ్రాయెల్‌ బాండ్స్‌ ద్వారా 50 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులను సమీకరించారు. వాటితో నీటి నిర్వహణ, వ్యవసాయ పరిశోధన, రహదారులు, సాంకేతికత, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టారు. ఈరోజు ఇజ్రాయెల్‌ అత్యాధునిక వ్యవసాయ దేశంగా నిలవడానికి ప్రవాసుల సహకారం ఒక ప్రధాన కారణం. చైనా సైతం ఈ విషయంలో ముందుంది. 1980లలో అక్కడ ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటైనప్పుడు వచ్చిన తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 60-70 శాతం ప్రవాస చైనీయులవే. షెన్‌జెన్‌ వంటి చిన్న మత్స్యకార గ్రామం ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ రాజధానిగా మారడంలో ఈ పెట్టుబడులు కీలకపాత్ర పోషించాయి. ఐర్లాండ్‌ తన గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐరిష్‌ నిపుణులను దేశార్థిక విధానాలతో అనుసంధానించింది. విదేశీ పెట్టుబడులు, స్టార్టప్‌లు, పరిశోధన, విద్యా రంగాల్లో ఈ నెట్‌వర్క్‌ విశేష ఫలితాలను ఇచ్చింది. రువాండా కూడా ఇలాగే ప్రవాస వైద్యులు, ఇంజినీర్లు, అధ్యాపకులను దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చింది. చిన్న దేశమైనప్పటికీ స్పష్టమైన విధానంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్ర£వాసుల నుంచి ఆశించాల్సింది కేవలం డబ్బు కాదనీ, అభివృద్ధికి దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కోరుకోవాలని ఈ దేశాలన్నీ చాటిచెప్పాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు రెండు విషయాల్లో అమేయ బలముంది. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రతిభాసంపన్న ప్రవాస సమాజం. రెండోది, పటిష్ఠ వ్యవసాయ-ఆహార వ్యవస్థ. దేశంలోనే అత్యధిక మత్స్య ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. మామిడి, మిరప, పసుపు, అరటి, ఆక్వా ఉత్పత్తులు, ఉద్యాన పంటలు, మిల్లెట్లు, విత్తన పరిశ్రమల్లో రెండు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ ప్రపంచ జీవసాంకేతిక, ఔషధ, ఐటీ కేంద్రంగా ఎదిగింది. ఈ బలాలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే వారధులుగా తెలుగు ప్రవాసులు సాయపడగలరు. ఇప్పటి వరకు ప్రవాసుల సహకారం ఎక్కువగా విద్య, ఆరోగ్యం, ధార్మిక, సేవా కార్యక్రమాలకే పరిమితమైంది. ఇప్పుడు వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, గ్రామీణ పారిశ్రామికీకరణ, నీటి నిర్వహణ, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయం వంటి రంగాల్లో పెట్టుబడులు అవసరం. ఎఫ్‌పీవోలకు విలువ ఆధారిత ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ కళాశాలలకు ఏఐ పరిశోధనా ప్రయోగశాలలు, గ్రామానికి ఒక డిజిటల్‌ వాతావరణ కేంద్రం, మండలానికొక డ్రోన్‌ సేవా కేంద్రం, జిల్లాకు ఒక మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌- ఇవి శాశ్వత అభివృద్ధి ఆస్తులు. ఇలాంటి వాటిలో పెట్టుబడులు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కొన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టవచ్చు. తెలుగు గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్, తెలుగు డయాస్పోరా అగ్రి-ఫుడ్‌ నవకల్పన నిధి, వాతావరణ మార్పుల అనుకూల వ్యవసాయ నిధి వంటివి ఏర్పాటు చేయవచ్చు. ప్రవాస శాస్త్రవేత్తల అధ్యాపక పీఠాలు, తెలుగు అగ్రి వెంచర్‌ క్యాపిటల్, ప్రపంచ మార్కెట్‌ వేదికలను ఏర్పరిస్తే- అవి దేశానికే ఆదర్శంగా నిలవగలవు. అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్‌ సంస్థలు, పరిశ్రమలు, ప్రవాస సంఘాలు కలిసి ఏటా ప్రపంచ తెలుగు అభివృద్ధి సదస్సు నిర్వహిస్తే విజ్ఞానం, పెట్టుబడులు, ఆవిష్కరణలు ఒకే వేదికపైకి వస్తాయి. తెలుగు రాష్ట్రాలకు ప్రపంచ స్థాయి ఐటీ నైపుణ్యాలు ఉన్నాయి. బలమైన వ్యవసాయ నేపథ్యమూ ఉంది. ఈ రెండింటినీ కలిపి అద్భుతమైన డిజిటల్‌ అగ్రి-ఫుడ్‌ వ్యవస్థను నిర్మించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, అగ్రిస్టాక్, డ్రోన్లు, రిమోట్‌ సెన్సింగ్, డిజిటల్‌ మార్కెట్లు, కార్బన్‌ వ్యవసాయం, వాతావరణ సేవల రంగాల్లో ఎందరో తెలుగు నిపుణులు ఉన్నారు. వారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో, విశ్వవిద్యాలయాలతో, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాల పురోగమనం వేగవంతమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని సారవంతమైన నేలను, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు మేధస్సును జతచేయగలిగితే- అభివృద్ధి ఒక లక్ష్యంగా మిగిలిపోదు; సహజ ఫలితంగా కళ్ల ముందుకు వస్తుంది. ప్రవాసులు పంపే డాలర్లు కుటుంబాలను నిలబెట్టగలవు. కానీ వారు తీసుకువచ్చే జ్ఞానం, ప్రపంచ అనుభవం, నాయకత్వం తరతరాల భవిష్యత్తును మార్చగలవు. ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలి. విశ్వవిద్యాలయాలు విజ్ఞాన వేదికలు కావాలి. పరిశ్రమలు భాగస్వామ్యం వహించాలి. ప్రవాసులు పెట్టుబడులతో పాటు దూరదృష్టినీ తీసుకురావాలి. ఈ నాలుగు శక్తులు ఒకే దిశగా కదిలితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనూ డయాస్పోరా ఆధారిత సమగ్ర అభివృద్ధికి ఆదర్శ నమూనాలుగా నిలుస్తాయి. అయితే, ప్రవాసులు పెట్టుబడి పెట్టాలంటే నమ్మకం అవసరం. అందుకే ప్రతి ప్రాజెక్టుకూ డిజిటల్‌ డ్యాష్‌బోర్డ్‌ ఉండాలి. ఎన్ని నిధులు వచ్చాయి, ఎక్కడ ఖర్చయ్యాయి, ఎంత మంది రైతులకు లాభం చేకూరింది, ఎంత నీరు ఆదా అయ్యింది, ఎన్ని ఉపాధి అవకాశాలు లభించాయి అనే వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ పారదర్శకతే మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




