
ముంబయి: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు (2029) ముందే భాజపా నేతృత్వంలోని ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలవుతుందన్న ధీమాను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం, గత 25 ఏళ్లలో గుజరాత్‌ రాష్ట్రం సాధించిన విజయాలను ఆదివారం ముంబయిలో ఆయన మీడియాకు వివరించారు. ‘‘ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ ముమ్మారు తలాక్‌ను నిషేధించాం. భారతీయ న్యాయ సంహితద్వారా దేశంలో నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేశాం. దీనివల్ల పలు రాష్ట్రాల్లో ఏడాది వ్యవధిలోనే వివిధ కేసుల్లో దోషులకు శిక్షల విధింపు 30శాతం పెరిగింది. బాధితులకు మూడేళ్లలోపే న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాం’’ అని అమిత్‌ షా తెలిపారు. మన దేశంతో కశ్మీర్‌ విలీనం సంపూర్ణమైందని చెబుతూ రాజ్యాంగ అధికరణలు 370, 35ఎ రద్దును గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలోకి మళ్లించినట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులను ఎలా గుర్తించగలుగుతున్నారో వెల్లడించేందుకు నిరాకరించారు. ప్రతి ఒక్క అక్రమ చొరబాటుదారుణ్నీ గుర్తించి దేశం నుంచి పంపించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయ రుగ్మతలకు కాలం చెల్లిపోయిందని, పనితీరు ప్రాతిపదిక రాజకీయాల శకం మొదలైందని అమిత్‌ షా తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





