
వెంటపడ్డ అటవీ వాహనాన్ని ఢీకొట్టి.. సిబ్బందిపై దాడికి యత్నం ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో ముగ్గురు స్మగ్లర్ల వాహనం ఢీకొనడంతో దెబ్బతిన్న అటవీశాఖ అధికారుల వాహనం రొంపిచెర్ల, న్యూస్‌టుడే: ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. తమను అడ్డుకోవడానికి యత్నించిన అటవీ సిబ్బందిని కారుతో ఢీకొని, పట్టుకోవడానికి యత్నించినవారిని కొరికి తప్పించుకునే యత్నం చేశారు. ఇద్దరు నిందితులు పట్టుబడగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ఘటన శనివారం రాత్రి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా తలకోన అటవీప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు పీలేరు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. దీంతో వారు కాపు కాశారు. వీరిని గుర్తించిన స్మగ్లర్లు.. అధికారుల వాహనాన్ని వేగంగా కారుతో ఢీకొట్టి ముందుకు సాగారు. అధికారులు మరో బృందాన్ని అప్రమత్తం చేయగా రెండో వాహనాన్నీ ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఛేదనలో తమిళనాడుకు చెందిన బాలకృష్ణ, రాజేంద్ర పట్టుబడగా.. మరో ముగ్గురు పారిపోయారు. పీలేరు ఫారెస్టు రేంజ్‌ అధికారి చంద్రశేఖర్‌ బృందం పట్టుబడిన దుండగులను అరెస్టుచేసి వాహనం, వారి ఆయుధాలను స్వాధీనం చేసుకొని పీలేరు అటవీ కార్యాలయానికి తరలించారు. గాయపడిన అటవీశాఖ సిబ్బంది ప్రతాప్, చరణ్, ప్రకాశ్‌లను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించినట్లు తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్‌ బాలకృష్ణ ఈనాడు, అమరావతి: ఆపరేషన్‌ అరణ్య విధుల్లో ఉన్న అటవీ సిబ్బంది వాహనాన్ని దుండగులు ఢీకొట్టిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ఈ ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, చికిత్సకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారంటూ అటవీ సిబ్బందిని అభినందించారు. పరారీలో ఉన్న ముగ్గురినీ వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. ఈ వివరాలను ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



