
భారతీయ సనాతన ధర్మంలో ప్రథమ పూజ్యుడిగా, విఘ్నేశ్వరుడిగా భక్తుల పూజలందుకునే దేవుడు వినాయకుడు. ఏ శుభకార్యం తలపెట్టినా, ముందుగా ఆయనను స్మరించుకోవడం సంప్రదాయం. గణపతికి ఒకే రూపం కాకుండా, పురాణాల ప్రకారం 32 దివ్య రూపాలు ఉన్నాయి. వీటినే ‘ద్వాత్రింశత్ గణపతి’ అని పిలుస్తారు. ముద్గల పురాణం, శ్రీతత్త్వ నిధి వంటి గ్రంథాల్లో వీటి గురించి ప్రస్తావించారు. ఒక్కో రూపానికి ప్రత్యేకమైన స్వరూపం, ఆయుధాలు, వాహనం, భంగిమతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది.
బాలుడిగా.. వీరుడిగా.. యోగిగా.. శక్తి స్వరూపంగా.. ఏకదంతుడిగా.. త్రిముఖుడిగా.. సింహ వాహనంతో.. ఇలా ఒక్కో గణపతి రూపం ఒక్కో ప్రత్యేక సందేశాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రాచీన దేవాలయాల్లో ఈ రూపాలకు సంబంధించిన విగ్రహాలు దర్శనమిస్తాయి. కొన్ని ప్రత్యేక క్షేత్రాల్లో మాత్రం ఈ 32 రూపాలను ఒకేచోట దర్శించవచ్చు.
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నంజనగూడులో కపిలా నది ఒడ్డున కొలువైన శ్రీ శ్రీకంఠేశ్వర స్వామి ఆలయం ‘దక్షిణ కాశి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ప్రాకారంలోని వెలుపలి గోడలపై గోధుమరంగు రాతితో చెక్కిన గణపతి 32 విభిన్న రూపాలలో కొలువై ఉన్నాడు. గణపతి స్వరూపంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ శిల్పాలు భక్తులను, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒకే క్షేత్రంలో గణపతి 32 రూపాలను దర్శించుకునే అవకాశం ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






