
UPI Charges | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును (MDR) ఎన్‌పీసీఐ ఖరారు చేసింది. అక్టోబర్‌ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.2వేల్లోపు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలూ వర్తించబోవని, ఆపైబడిన నిర్దిష్ట లావాదేవీలకు మాత్రం 0.4 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించింది. అయితే, ఈ ఛార్జీలు ఎవరు చెల్లించాలి? ఏయే చెల్లింపులకు వర్తిస్తుంది? వంటి సందేహాలకు సమాధానాలుగా FAQను ఎన్‌పీసీఐ విడుదల చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ ఎంత? రూ.2,000 కంటే ఎక్కువ విలువైన P2M యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. అలాగే రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఎండీఆర్‌ గరిష్ఠంగా రూ.300కు పరిమితం. రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి నిర్దిష్ట విభాగాల్లో రూ.2,000 దాటిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్‌ వర్తిస్తుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ఎండీఆర్‌లతో పోలిస్తే? యూపీఐ ఎండీఆర్‌ చాలా తక్కువ. క్రెడిట్ కార్డుల ఎండీఆర్‌ సాధారణంగా 1.5% నుంచి 2.5% వరకు ఉంటుంది. డెబిట్ కార్డుల ఎండీఆర్‌ 0.90% వరకు ఉంటాయి. యూపీఐ ఎండీఆర్‌ కేవలం 0.4% (గరిష్ఠంగా రూ.300) మాత్రమే. ప్రభుత్వ రాయితీలు ఎందుకు సరిపోవు? యూపీఐ నిర్వహణ, సర్వర్లు, సైబర్ సెక్యూరిటీ, బ్యాంక్ సాంకేతిక మద్దతు వాటి కోసం ఏడాదికి దాదాపు రూ.20వేల కోట్లు ఖర్చవుతాయి. శాశ్వత సాంకేతిక ఆవిష్కరణలకు వాణిజ్యపరమైన ఆదాయ నమూనా అవసరం. జీరో ఎండీఆర్‌ విధానంలో కేవలం పెద్ద టెక్ కంపెనీలు మాత్రమే నష్టాలను భరించగలవు. స్థిరమైన వాణిజ్య నమూనా రావడం వల్ల చిన్న ఫిన్‌టెక్ స్టార్టప్‌లు కూడా మార్కెట్లోకి రావడానికి వీలవుతుంది. స్థానిక దుకాణాల్లో QR కోడ్ స్కాన్ చేసినప్పుడు ఫీజు చెల్లించాలా? అవసరం లేదు. స్థానిక దుకాణాలు లేదా వీధి వ్యాపారుల వద్ద క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి చేసే చెల్లింపులు వినియోగదారులకు పూర్తిగా ఉచితం. స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపితే? ఎటువంటి ఛార్జీ ఉండదు. వ్యక్తుల మధ్య జరిగే బదిలీలు (P2P) లేదా ఒకరి ఖాతాల మధ్య చేసుకునే స్వీయ బదిలీలు ఉచితంగానే కొనసాగుతాయి. యూపీఐ యాప్‌లు ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేస్తాయా? వసూలు చేయవు. యూపీఐ లావాదేవీలపై ప్లాట్‌ఫామ్ ఫీజు లేదా ఇతర ఛార్జీలు వసూలు చేయకూడదని యూపీఐ ప్రొవైడర్లకు స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయి. పెద్ద వ్యాపారులు MDR ఛార్జీలను కొనుగోలుదారులపై మోపొచ్చా? వీలులేదు. వ్యాపారులు ఈ ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదు. కస్టమర్లు అసలు ధర మాత్రమే చెల్లిస్తారు.





