
తిరుపతిలో తనిఖీలు నిర్వహిస్తున్న నగరపాలిక, తూనికల, ఆహార భద్రతాధికారులు తిరుపతి (నగరపాలక), న్యూస్‌టుడే: తిరుపతిలో గరిష్ఠ చిల్లర ధరలకు తిలోదకాలు ఇచ్చారు. ప్రధానంగా భక్తులు, యాత్రికులు, ప్రయాణికులను యథోచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ ఇది మరింత అధికంగా ఉంటోంది. నాసిరకం వస్తువులు అంటగట్టడం, ప్రతిదానిపై రూ.5 నుంచి రూ.10 అదనంగా దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. బస్టాండ్‌లోని ఓ దుకాణంలో రూ.20 నీటి బాటిల్‌కు ఏకంగా రూ.30 వసూలు చేశారు. లేదంటే ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. వాళ్లడిగిన మొత్తం చెల్లించిన నగరపాలిక సిబ్బంది మెల్లగా వెళ్లిపోయారు. ఆవెంటనే నగరపాలిక, తూనికలు కొలతలు, ఆహార భద్రతాధికారులు దాడులు చేసి జరిమానాలు విధించారు. ఇలా వారెళ్లిన ఆరు దుకాణాల్లోనూ అధిక ధరలు వసూలు చేయడంతో ఆధారాలు చూపి తీవ్రంగా హెచ్చరించారు. బ్రహ్మోత్సవ వేళ భక్తులను దోచుకుంటే సహించేది లేదంటూ స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల కోసం తరలివచ్చే వేలాదిమంది భక్తులకు తిరుపతిలో పరిశుభ్రమైన ఆహారాన్ని అందిచాలన్న లక్ష్యంతో కలెక్టర్, నగరపాలిక కమిషనర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో నగరపాలిక వైద్యాధికారి డా.యువఅన్వేష్, పశు వైద్యాధికారి డా.గుణశేఖర్, ఆహార భద్రతాధికారి జగదీష్, తూనికలు, కొలతల అధికారులతో కలిసి బస్టాండ్, పరిసరాల్లోని హోటళ్లలో దాడులు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న రెండు హోటళ్లను సీజ్‌ చేయడంతోపాటు బస్టాండ్‌ ఆవరణలో అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానాలు విధించారు. కపిలతీర్థం సమీపంలోని హోటళ్లను తనిఖీచేశారు. దాదాపు అన్నింటిలో సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, మురుగునీటి కాలువల్లో విచ్చలవిడిగా వ్యర్థాలను వేయడం, ప్రవాహానికి ఆటంకం కలిగించడం, ఎలుకలు, బొద్ధికంలు సంచరించడం గుర్తించడంతో జరిమానాలు విధించి నోటీసులు అందించారు. 500 కిలోల ఆహార వ్యర్థాలు స్వాధీనం చేసుకుని డంపింగ్‌ యార్డ్‌కు తరలించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




