
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ ఇంటి వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఇప్పటివరకు చిన్నచిన్న విషయాలకే పరిమితమైన విభేదాలు.. నామినేషన్స్ సమయంలో మాత్రం బహిరంగ విమర్శలు, వాదోపవాదాలుగా మారాయి. ఎవరిని నామినేట్ చేయాలి? అందుకు కారణమేంటి? అనే విషయంలో కంటెస్టెంట్స్ తమ వాదనలను బలంగా వినిపించారు. ముఖ్యంగా త్రిగుణ్–రోహిత్, త్రిగుణ్–సుధీర్, షాలిని–వర్షిణి మధ్య జరిగిన వాగ్వాదాలు ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి. ఈసారి బిగ్‌బాస్ నామినేషన్స్‌ను కాస్త భిన్నంగా నిర్వహించారు. బజర్ మోగిన ప్రతిసారీ ఇద్దరు కంటెస్టెంట్స్‌ను పిలిచి తాడును తొలగించే పోటీ పెట్టారు. ముందుగా టాస్క్‌ను పూర్తి చేసిన వ్యక్తికి ఇద్దరు సభ్యులను నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియలో ముందుగా సుధీర్ రెడ్డి.. త్రిగుణ్, షాలినిలను నామినేట్ చేశారు. అనంతరం రోహిత్ వంతు రాగా.. అతడు ఎలాంటి సందేహం లేకుండా త్రిగుణ్‌ను టార్గెట్ చేశాడు. మరో నామినేషన్‌గా ఝాన్సీ పేరును కూడా చెప్పాడు. త్రిగుణ్‌ను నామినేట్ చేయడానికి రోహిత్ చెప్పిన కారణాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో త్రిగుణ్ తనపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తనకు చాలా అహ్యంగా అనిపించాయని రోహిత్ చెప్పాడు. ముఖ్యంగా తనను ‘స్టెరాయిడ్స్’ అంటూ త్రిగుణ్ చేసిన వ్యాఖ్యను రోహిత్ తీవ్రంగా తప్పుబట్టాడు. అంతేకాకుండా సృష్టిని సుధీర్పైకి ‘తోమడానికి పంపుతున్నాడు’ అంటూ త్రిగుణ్ చేసిన వ్యాఖ్య కూడా తనకు చాలా అభ్యంతరకరంగా అనిపించిందని చెప్పాడు. ఈ కారణాలతోనే త్రిగుణ్‌ను నామినేట్ చేస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలకు త్రిగుణ్ కూడా గట్టిగానే స్పందించాడు. తన మాటలకు ఉన్న నేపథ్యం, తన ఉద్దేశం ఏమిటో వివరిస్తూ రోహిత్ వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. ఇక ఝాన్సీని నామినేట్ చేస్తూ రోహిత్ ఆమె సొంతంగా ఆట ఆడటం లేదని, సురక్షితంగా ఆడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాడు. దీనిపై ఝాన్సీ కూడా వెంటనే స్పందించింది రోహిత్ తనను ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ సమయంలో త్రిగుణ్ కూడా రోహిత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇదే సందర్భమని వివరణ ఇచ్చాడు. దీంతో నామినేషన్ ప్రక్రియలో వాదనలు మరింత ముదిరాయి. మరోవైపు జబర్దస్త్ నరేష్.. షాలినిని నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ ఇంట్లో జరిగే సమావేశాలు, టాస్క్‌లకు షాలిని సమయానికి రాదని, బిగ్‌బాస్ చెప్పే వరకు అక్కడికి చేరుకోదని అతడు కారణం చెప్పాడు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని ఆమె చాలా సీరియస్‌గా తీసుకుంటుందని విమర్శించాడు. నరేష్ వ్యాఖ్యలపై షాలిని కూడా తీవ్రంగా స్పందించింది. రామ్ ప్రసాద్‌కు అనుకూలంగా ఉంటూ పక్కనున్నవారిపై విమర్శలు చేయవద్దంటూ నరేష్‌కు కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. నామినేషన్స్‌లో త్రిగుణ్ కూడా తన ప్రత్యర్థులను వదల్లేదు. అతడు సుధీర్, రోహిత్‌లను నామినేట్ చేశాడు. దీంతో త్రిగుణ్–రోహిత్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.ఇప్పటికే ఇద్దరి మధ్య పలు సందర్భాల్లో మాటల యుద్ధం జరగగా.. నామినేషన్స్ వేదికగా ఆ విభేదాలు మరింత బహిరంగంగా మారాయి. ఒకరిపై ఒకరు తమకు ఉన్న అభ్యంతరాలను నేరుగా చెప్పుకోవడంతో ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఎపిసోడ్లో అత్యంత వేడెక్కిన ఘట్టాల్లో షాలిని–వర్షిణి మధ్య జరిగిన వివాదం ఒకటి. త్రిగుణ్ తన వాదన వినిపిస్తున్న సమయంలో షాలిని మధ్యలో కలగజేసుకుని.. ఎవరూ చప్పట్లు కొడుతూ మధ్యలో జోక్యం చేసుకోవద్దని సూచించింది. షాలిని–వర్షిణి మధ్య మొదలైన వాగ్వాదం చివరకు ఒకరినొకరు తోసుకునే స్థాయికి వెళ్లడం ఎపిసోడ్లో కలకలం రేపింది. దీంతో మిగతా కంటెస్టెంట్స్ కూడా ఈ వివాదంపై దృష్టి పెట్టారు. నామినేషన్స్ ప్రక్రియలో సాధారణంగా కనిపించే మాటల యుద్ధం ఈసారి శారీరకంగా దగ్గరయ్యేంత వరకు వెళ్లడంతో హౌస్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొత్తంగా రెండో వారానికి సంబంధించి నామినేషన్స్‌లో షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, ముకేశ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ నిలిచారు.





