
పీజీ వైద్య కోర్సుల్లో దివ్యాంగ అభ్యర్థుల అర్హతపై ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు ఈనాడు, అమరావతి: కేవలం వైకల్యం శాతాన్ని చూసి అభ్యర్థులను తిరస్కరించడం సరికాదని, వారు వైద్య చికిత్సలు, విధులు ఎంతవరకు నిర్వహించగలరనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది. వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే దివ్యాంగ అభ్యర్థుల అర్హతల నిర్ధారణకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వేషన్‌ ప్రయోజనం పొందాలంటే 40% వైకల్యం తప్పనిసరని.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూడీఐడీ కార్డును ప్రాథమిక ఆధారంగా పరిగణిస్తామని తెలిపింది. గతంలో ఇచ్చే డిసేబిలిటీ సర్టిఫికెట్‌ స్థానంలో ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ను మెడికల్‌ అసెస్‌మెంట్‌ బోర్డులు జారీ చేస్తాయని పేర్కొంది. అభ్యర్థి ఆయా కోర్సులకు తగిన వారా..? కాదా..? అనే విషయం ఇందులో స్పష్టంగా ఉంటుందని వివరించింది. సహాయ ఉపకరణాలు, సాంకేతిక పరికరాలు ఉపయోగించి వైద్య విధులు నిర్వహించగలిగే వారి ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. శస్త్రచికిత్స విభాగాల్లో వేగం, చేతివేళ్ల నైపుణ్యం అవసరం కనుక చేతుల వైకల్యం ఉన్నవారు ఈ బ్రాంచీలకు అనువైన వారు కాదని పేర్కొంది. జనరల్‌ మెడిసిన్, డెర్మటాలజీ, ప్రీ క్లినికల్‌ బ్రాంచీల్లో తగిన సహాయక పరికరాలతో విధులు నిర్వహించగలిగితే అనుమతి ఇస్తామని తెలిపింది. ఆటిజం, లెర్నింగ్‌ డిజార్డర్స్, నాడీ సంబంధిత సమస్యలున్నవారి పరిస్థితి నిలకడగా ఉండి.. రోగుల భద్రతకు ఎలాంటి ఇబ్బందీ లేకపోతే వారిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఏ అభ్యర్థినైనా అనర్హుడిగా ప్రకటిస్తే అందుకు పూర్తి కారణాలను లిఖిత పూర్వకంగా మెడికల్‌ బోర్డు రికార్డు చేయాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. మెడికల్‌ బోర్డు నిర్ణయంపై అసంతృప్తి ఉంటే అప్పిలేట్‌ అథారిటీకి అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దివ్యాంగ విద్యార్థులకు క్లినికల్‌ వసతులు సమకూర్చడానికి ప్రతి వైద్య కళాశాలలో ప్రత్యేకంగా ఒక నోడల్‌ అధికారిని నియమించాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





