
వైకాపా ప్రభుత్వం రూ.1,234 కోట్లు అదనంగా చెల్లించింది ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణలో సీపీఎం నేత బాబూరావు ఈనాడు, అమరావతి: హిందుజా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తికి విదేశీ బొగ్గు వినియోగం, రైల్వేలైన్‌ పూర్తి కాకపోవడంతో రోడ్డు రవాణా ద్వారా బొగ్గు సరఫరాకు అదనంగా చేసిన ఖర్చులను చరవ్యయం కింద చెల్లించాలని ఆ సంస్థ కోరడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖలోని 1,040 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ ప్లాంట్‌ నుంచి 2022 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు చరవ్యయం, క్యారీయింగ్‌ కాస్ట్‌ అదనంగా చెల్లించాలని ఏపీఈఆర్‌సీలో హిందుజా పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఏపీఈఆర్‌సీ బుధవారం బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సమావేశంలో బాబూరావు వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వంలో ఉత్పత్తి చేయని విద్యుత్‌కు డిస్కంలు రూ.1,234 కోట్లు చెల్లించాయి. ఇప్పుడు క్యారీయింగ్‌ కాస్ట్‌ కింద మళ్లీ అదనపు మొత్తాల కోసం సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ సంస్థకు మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి బొగ్గు సరఫరా లింకేజి ఉంది. బొగ్గు రవాణా కోసం రైల్వేట్రాక్, ఇతర ఖర్చులను మూలధన పెట్టుబడిలో కలిపి చూపింది. అలాంటప్పుడు చరవ్యయం ఎలా చెల్లిస్తారు? ఈ అక్రమ చెల్లింపులను కమిషన్‌ ఆపాలి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయకుండానే ఒప్పందం రద్దుకు నష్టపరిహారం (లిక్విడేటెడ్‌ డ్యామేజెస్‌) పేరుతో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ విష్‌ రెన్యువల్‌ లిమిటెడ్‌ కంపెనీకి సుమారు రూ.2,500 కోట్లు చెల్లించేందుకు మూడు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) రూ.764.97 కోట్లు చెల్లించింది. స్మార్ట్‌మీటర్ల వ్యవహారంపై హైకోర్టులో పిల్‌ పెండింగ్‌లో ఉంటే.. డిస్కం ఎలా చెల్లిస్తుంది’ అని ప్రశ్నించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





