
ఈనాడు, అమరావతి: అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు దేహదారుఢ్య (ఫిజికల్‌ ఎఫిషియన్సీ), రాత పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో ఈ పోస్టులకు శారీరక కొలతల (ఫిజికల్‌ మెజర్‌మెంట్‌) పరీక్షలు మాత్రమే ఉండేవి. అందులో అర్హత సాధిస్తే డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించి మెరిట్‌లో ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఆ నిబంధనలు మారాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తొలుత శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు(పీఈటీ) ఉంటాయి. పీఈటీలో భాగంగా పది నిమిషాలు, అంతకంటే తక్కువ సమయంలో 1,600 మీటర్ల పరుగు పూర్తిచేయాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో అర్హత సాధించిన వారికి 100 మార్కులకు డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారికి చివర్లో రాతపరీక్ష నిర్వహిస్తారు. మూడు గంటల పాటు పరీక్ష ఉంటుంది. ఈ మేరకు నిబంధనలు మారుస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 147 పోస్టులకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





