
శరవేగంగా ఆర్‌ఓఆర్‌ల నిర్మాణం రైల్వే ఇంజినీరింగ్‌ అద్భుతమిది న్యూస్‌టుడే, విజయవాడ (రైల్వేస్టేషన్‌) నిర్మాణంలో ఉన్న బైపాస్‌ రైలు వంతెన రైలుపై నుంచి రైలు వెళ్లడం ఎక్కడైనా చూశారా! అతి త్వరలోనే విజయవాడ డివిజన్‌లో ఈ దృశ్యం కనిపించబోతోంది. ఈ బైపాస్‌ నిర్మాణం అందరినీ ఆకర్షించనుంది. ఒక రైల్వేలైన్‌ను మరో లైన్‌ దాటే చోట లెవల్‌ క్రాసింగ్‌ బదులు ఒక మార్గాన్ని మరో మార్గం పైనుంచి తీసుకెళ్లేందుకు రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌ఓఆర్‌) నిర్మిస్తున్నారు. విజయవాడ డివిజన్‌ ఆదాయంలో సింహభాగం సరకు రవాణాదే. ప్రస్తుతం విజయవాడ రైల్వేస్టేషన్‌లో ట్రాఫిక్‌ ఒత్తిడి కారణంగా సకాలంలో గమ్యస్థానం చేరలేకపోతున్నాయి. దీనికి త్వరలోనే చెక్‌ పడనుంది. ఖాజీపేట, సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే గూడ్స్‌ రైళ్లు విజయవాడలోకి ప్రవేశించకుండా ప్రత్నామ్నాయ మార్గంలో మళ్లించేలా బైపాస్‌ను నిర్మిస్తున్నారు. రాయనపాడు, ముస్తాబాద వద్ద 22 కిలోమీటర్ల మేర బైపాస్‌ రైలు మార్గం రూపుదిద్దుకుంటోంది. సుమారు రూ.500 కోట్లతో ఏడాది కిందట చేపట్టిన ఈ రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌వోఆర్‌) నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. బైపాస్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాయనపాడు, గుణదల స్టేషన్లు పూర్తి స్థాయిలో శాటిలైట్‌ స్టేషన్లుగా మారనున్నాయి. గత కృష్ణా పుష్కరాల సమయంలో ఈ రెండు స్టేషన్లను రూ.కోట్ల వ్యయంతో శాటిలైట్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. వచ్చే పుష్కరాల నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకోకుండానే ఆయా స్టేషన్ల నుంచి నగరంలోకి నేరుగా ప్రవేశించవచ్ఛు ఇప్పటికే రెండు స్టేషన్లను అమృత్‌ భారత్‌ పథకంలో రూ.150 కోట్లతో నిర్మించారు. మొత్తం 22 కి.మీ మార్గాన్ని మూడు విభాగాలుగా చేపట్టారు. రాయనపాడు, విజయవాడ నార్త్‌, ఈస్ట్‌ క్యాబిన్‌ల మధ్య 10 కి.మీ దూరం ఒక భాగం. విజయవాడ నార్త్‌, ఈస్ట్‌ క్యాబిన్‌, గుణదల మధ్య 6 కి.మీ మార్గం 2023లోనే అందుబాటులోకి వచ్చింది. ఇది బైపాస్‌కు కీలకంగా పని చేస్తోంది. గుణదల, ముస్తాబాద మధ్య మరో 6 కి.మీ మార్గం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ మూడు విభాగాలు పూర్తి స్థాయిలో అనుసంధానమైతే రాయనపాడు నుంచి ముస్తాబాద వరకు ప్రత్యామ్నాయ రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. బైపాస్‌ నిర్మాణం పూర్తయితే విజయవాడ డివిజన్‌ సరకు రవాణా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





