
వీబీజీ రామ్‌జీ అక్రమార్కులకు దన్ను ఈనాడు డిజిటల్‌ - పాడేరు బలపంలో విచారణ చేస్తున్న డ్వామా పీడీ విద్యాసాగర్‌ కొయ్యూరు మండలం ఆడాకుల గ్రామంలో 600 వరకు కుటుంబాలుంటాయి. ఇందులో కొన్ని కుటుంబాల వారికి నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో ఒక్కొక్కరికీ ఒక్కో వీబీజీ రామ్‌జీ (గతంలో ఉపాధి హామీ) జాబ్‌కార్డు మంజూరు చేశారు. ఇటీవల స్థానికంగా గొడవలు జరగడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషయం స్థానిక ఏపీఓ దగ్గరకు వెళ్లినా ఈ విషయంపై సమగ్ర విచారణ చేయలేదు. ఇచ్చిన జాబ్‌కార్డులను సైతం కనీసం రద్దు కూడా చేయలేదు. జిల్లాలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని అక్రమార్కులు రెండు చేతులా వినియోగించుకుంటున్నారు. గ్రామీణ స్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన అధికారులే.. అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నారు. ఏటా రూ. కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. పారదర్శకంగా జరుగుతున్నాయా.. లేదా నిర్ధారించడానికి ఏటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పనులు పరిశీలించి లోపాలు గుర్తిస్తున్నారు. సంబంధిత సిబ్బందికి జరిమానాలు విధించి సొమ్ము రికవరీకి ఆదేశాలు ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పనుల నిర్వహణలో మార్పు రావడంలేదు. అవే తప్పులు పునరావృతం అవుతున్నాయి. కొన్ని చోట్ల కూలీలు రాకున్నా.. వచ్చినట్లు హాజరు వేయడం, పని కొలతల్లో ఎక్కువ, తక్కువ నమోదు చేయడం, గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా చెల్లింపులు చేయడం వంటివి సాగుతున్నాయి. ఆయా పనులపై క్షేత్రస్థాయిలో నిఘా, పర్యవేక్షణ లోపించడం వల్లే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. షోకాజు నోటీసులు జారీ చేశాం: క్రమంగా ఒక్కో మండలంలో సామాజిక తనిఖీలు చేస్తున్నాం. చింతపల్లిలో భారీగా అక్రమాలు గుర్తించాం. రూ. 50 లక్షల వరకు రికవరీ చేశాం. జి.మాడుగులలో జరిగిన అవకతవకలపైనా సిబ్బందికి నోటీసులు ఇచ్చాం. అక్రమాలకు పాల్పడితే కేసులు పెడతాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





