
కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం గురించి అవగాహన కల్పిస్తున్న అటవీ డివిజనల్‌ అధికారి రామ్‌మోహన్‌ కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమీ దూలపల్లి నుంచి వచ్చిన 57 మంది శిక్షణ రేంజి అధికారులు కలియతిరిగారు. ముందుగా గోండుగూడ గేట్‌ నం.1 నుంచి కాలినడకన బైసన్‌కుంట వరకు వెళ్లారు. అటవీ పర్యావరణం, వన్యప్రాణుల ఆవాసాలు, జీవవైవిధ్యం, అటవీ సంరక్షణ, క్షేత్రస్థాయిలో అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి ఎఫ్‌డీవో రామ్‌మోహన్, రేంజి అధికారి బాబా ఖాదర్‌వలీ, క్షేత్రస్థాయి సిబ్బంది వివరించారు. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో క్షేత్ర పర్యటనకు ఒడిశా నుంచి 22 మంది, మహారాష్ట్ర నుంచి 16, మధ్యప్రదేశ్‌ నుంచి 18, కేరళం నుంచి ఒకరు వచ్చారు. దూలపల్లి అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ మంజుల ఆధ్వర్యంలో వీరంతా క్షేత్ర పర్యటన చేసి ఎన్నో అంశాలను నేర్చుకున్నారు. డిప్యూటీ రేంజి అధికారి మమత, సెక్షన్‌ అధికారి శంకర్, బీట్‌ అధికారులు సంతోష్, టీఏ మహేశ్‌ వీరికి క్షేత్రస్థాయిలో విధి నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం డాగ్‌ స్క్వాడ్‌ గురించి శిక్షణ పొందిన బీట్‌ అధికారి అనిల్‌ శిక్షణ రేంజి అధికారులకు వివరించారు. అడవుల గురించి అధ్యయనం చేసిన శిక్షణ రేంజి అధికారుల అనుభవాలు వారి మాటల్లోనే.. గడ్డి క్షేత్రాల పెంపకం బాగుంది కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో నడుచుకుంటూ తిరగడం ఎంతో అనుభూతిని కలిగించింది. వివిధ రకాల విలువైన చెట్లకు కవ్వాల్‌ నిలయంగా అనిపించింది. ముఖ్యంగా శాకాహార జంతువుల కోసం పెంచుతున్న గడ్డి క్షేత్రాలు పచ్చదనంతో ఆకట్టుకున్నాయి. నాలుగు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లడం, వాతావరణం చల్లగా ఉండటంతో ఇక్కడి ప్రాంతాలు మరింత ఆకట్టుకున్నాయి. అధికారులు నేర్పించిన అంశాలు విధి నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అడవి దున్నలు, నీలుగాయి కనిపించాయి అడవి దున్నలు, నీలుగాయి కనిపించాయి చేతన్‌వోషో, మధ్యప్రదేశ్‌ కవ్వాల్‌ అడవుల్లో అడవి దున్నలు, నీలుగాయి వంటి జంతువులను అతి దగ్గరగా చూశాను. రకరకాల పక్షుల సందడి ఆకట్టుకుంది. చిరుతపులి పాదముద్రలు కనిపించాయి. బీట్, సెక్షన్, డిప్యూటీ రేంజి అధికారి విధులు ఎలా నిర్వర్తించాలి. ఏఏ పనులు చేయాల్సి ఉంటుంది. పీవోఆర్‌ రాసే విధానం తదితర అంశాలను ఇక్కడి సిబ్బంది, అధికారులు స్పష్టంగా వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





