
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
8th Pay Commission Latest Updates: 8వ వేతన సంఘం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్ల నియామకానికి సంబంధించి 8వ వేతన సంఘం సోమవారం కీలక మార్పులను ప్రకటించింది. కన్సల్టెంట్ల అర్హతలు, పని అనుభవం, వయోపరిమితికి సంబంధించిన నిబంధనలను సవరిస్తూ కమిషన్ ఒక అధికారిక మెమోరాండం విడుదల చేసింది. కమిషన్ కార్యకలాపాల నిర్వహణ కోసం మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ప్రకటన కేవలం కమిషన్ అంతర్గత సిబ్బంది అవసరాల కోసం మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు లేదా పెన్షన్ల మార్పులకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు.
ఈ నియామకాల్లో పోస్టులను అనుభవం ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటిది సీనియర్ కన్సల్టెంట్ విభాగం కాగా.. దీనికి గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. కనీసం 10 ఏళ్ల సంబంధిత అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తూ ఈ విభాగంలో గతంలో ఉన్న 5 పోస్టులను 2 పోస్టులకు కుదించారు. రెండోది కన్సల్టెంట్ విభాగం.. దీనికి 40 ఏళ్ల గరిష్ట వయోపరిమితితో పాటు కనీసం ఆరేళ్ల అనుభవం అవసరం. ఇందులో గరిష్టంగా ఐదుగురిని నియమించనున్నారు. ఇక మూడోది యంగ్ ప్రొఫెషనల్ విభాగం కాగా.. దీనికి 32 ఏళ్ల వయోపరిమితి, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. గతంలో పది పోస్టుల సంఖ్యను ఇప్పుడు 16కు పెంచారు. ఈ మూడు విభాగాలకు వయస్సు, అనుభవాన్ని లెక్కించడానికి ఆగస్టు 1, 2026ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు.
విద్యార్హతల విషయానికి వస్తే.. హ్యూమన్ రీసోర్సెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సంబంధిత విభాగాలలో మాస్టర్స్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లీగల్ రీసెర్చ్ లేదా ట్రిబ్యునల్, కోర్టు వ్యవహారాలను నిర్వహించిన అనుభవం ఉన్న లా (LL.B) గ్రాడ్యుయేట్లతో పాటు ఐటీ, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్లో అనుభవం ఉన్న బీటెక్, ఎంటెక్ అభ్యర్థులు కూడా అర్హులుగా పేర్కొన్నారు. పరిశోధన చేయడం, సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, డ్రాఫ్ట్ నోట్స్ సిద్ధం చేయడంలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. దీనితో పాటు ఎక్సెల్ స్ప్రెడ్షీట్లు వాడటం, ప్రెజెంటేషన్లు తయారు చేయడంలో అనుభవం అన్ని కేటగిరీల అభ్యర్థులకు తప్పనిసరి.
ఎంపికైన కన్సల్టెంట్లు కమిషన్‌లో పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు ఇతర ఏ సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు. ఇవి పూర్తిగా తాత్కాలిక కాంట్రాక్ట్ నియామకాలు మాత్రమేనని, ఎలాంటి ముందస్తు సమాచారం లేదా కారణం చూపకుండానే నియామకాన్ని రద్దు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుందని నిబంధనల్లో స్పష్టం చేశారు.





