ఇటీవల కొన్ని సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయాలు సాధిస్తున్నాయి. పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సులు, స్పెషల్ సాంగ్స్, వీఎఫ్ ఎక్స్ హంగులు లేనప్పటికీ కేవలం కంటెంట్ తో కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపిస్తున్నాయి. నివిన్ పాలి, మమితా బైజు హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బెత్లెహొమ్ కుటుంబ యూనిట్’ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. కొద్ది రోజుల క్రితమే మలయాళంలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. థియేటర్లలో ఈ సినిమా రిలీజై నెల రోజులు సమీపిస్తున్నా కలెక్షన్ల హీరో ఆగడం లేదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా అదే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తోన్నఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.