
amit shah on UCC | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉమ్మడి పౌరస్మృతి (UCC) అంశంపై కేంద్రహోంమంత్రి అమిత్‌షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి భాజపా నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత విషయాల్లో ఒకే రకమైన చట్టాన్ని వర్తింపజేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతిని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకొచ్చామని అమిత్‌షా చెప్పారు. 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా అమిత్‌షా పేర్కొన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదం పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశామన్నారు. 2014కు ముందు అవినీతి, వారసత్వ రాజకీయ యుగం రాజ్యమేలాయన్నారు. భాజపా దాన్ని పూర్తిగా మార్చివేసి, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని గుర్తుచేశారు. ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితా నుంచి దేశాన్ని ఐదు అగ్ర దేశాల జాబితాలోకి చేర్చామని చెప్పారు. ఈ సందర్భంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నమోదైన 7.8% జీడీపీ వృద్ధిని ప్రస్తావించారు. దేశ అంతర్గత భద్రతకు సవాళ్లు విసురుతూ వస్తున్న ఆర్టికల్‌ 370, నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి వంటి సమస్యలను తమ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని తెలిపారు. ప్రజాసేవలో ప్రధాని మోదీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ను చేపట్టనున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వినాయకచవితి వేళ కోల్‌కతాలోని భవానీ పూర్‌లోని ఒక మిఠాయి దుకాణం భారీ మోదక్‌కు సిద్ధం చేసింది.





