
పలు మార్గాల్లో ట్రాఫిక్ సిమ్యులేషన్ స్టడీకి యోచన ఈనాడు, హైదరాబాద్: మహానగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీకి కారణాలు, ప్రత్యామ్నాయ చర్యలను అంచనా వేసేందుకు ట్రాఫిక్ సిమ్యులేషన్ విధానంలో అధ్యయనం చేసేందుకు ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిపి హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తొలుత కేబీఆర్ పార్కు, జీవీకే, నానల్‌నగర్ కారిడార్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ అధ్యయనం చేయనున్నారు. ట్రాఫిక్ సిమ్యులేషన్ అధ్యయనం అనేది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సాయంతో రోడ్లు, వాహనాల రాకపోకలు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ప్రవాహాన్ని వర్చువల్‌గా సృష్టించి విశ్లేషించే అధునాతన పద్ధతి. రోడ్లపై కొత్తగా ఫ్లైఓవర్లు, సిగ్నల్ వ్యవస్థను మార్చడం లాంటి పనులు చేపట్టేందుకు వాటి ప్రభావం ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఈ అధునాతన విధానాన్ని వినియోగిస్తున్నారు. నగరంలో చాలా జంక్షన్లు, కొన్ని కారిడార్లలో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉంటోంది. సరైన ట్రాఫిక్ అధ్యయనం లేక ఏళ్ల తరబడి ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అవసరం లేనిచోట ఫ్లైఓవర్ల నిర్మాణం చేయడం.. రోడ్లు విస్తరించాల్సిన ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోక.. ట్రాఫిక్ మరింత పెరుగుతోంది. ఈ ప్రభావం దానికి అనుసంధానమైన ఇతర మార్గాలపై పడటం వల్ల కొన్నిసార్లు ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ అధ్యయనంలో ముందుగా ఒక ప్రాంతానికి చెందిన నిజమైన డేటా...రోడ్డు వెడల్పు, గంటకు వెళ్లే వాహనాల సంఖ్య, సిగ్నల్ టైమింగ్స్ తదితర సేకరించి కంప్యూటర్ మోడల్‌లో నమోదు చేస్తారు. తర్వాత సాఫ్ట్‌వేర్ ద్వారా మైక్రోస్కోపిక్, మెసోస్కోపిక్, మాక్రోస్కోపిక్ పద్ధతుల్లో విశ్లేషిస్తారు. తొలుత మైక్రోస్కోపిక్‌లో ప్రతి వాహనం వేగం, లేన్ మారడం, ముందు వాహనానికి మధ్య దూరం పరిశీలిస్తుంది. మెసోస్కోపిక్ విధానంలో చిన్న వాహనాల సమూహాల కదలికలను అధ్యయనం చేస్తుంది. మాక్రోస్కోపిక్ ద్వారా మొత్తం నగరం లేదా ఒక పెద్ద రహదారి నెట్‌వర్క్‌లోని ట్రాఫిక్ సాంద్రత, సగటు వేగాన్ని పరిశీలిస్తారు. గమనిక