
సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా: సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందనే అవకాశం ఉండటంతో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు దీనిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని హరీశ్ రావు సూచించారు. పఠాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో సర్, పార్టీ సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ అవగాహన సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీశ్ రావు, గూడెం మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్కామ్‌ల ప్రభుత్వం పోయి, సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పఠాన్‌చెరు బీఆర్ఎస్‌కు బలమైన కోటని పేర్కొన్న ఆయన.. గత మున్సిపల్ ఎన్నికల్లో ఐదుకు ఐదు ఛైర్మన్ పదవులు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పఠాన్‌చెరు ఫలితాలపై అందరి దృష్టి నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన హరీశ్ రావు.. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు