
హింగోలి: విద్యా విభాగం అధికారులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా తప్పనిసరి చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం డిమాండ్ చేశారు. పల్లెల్లో విద్యార్థుల కష్టాలు, చదువు కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచే వారి దైన్యాన్ని అర్థం చేసుకునేందుకు మంత్రులు, రాజకీయ నాయకులు తమ చిన్నారులను గ్రామాల్లోని బడులకు ఒక్క రోజైనా పంపాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘పాఠశాలలను మెరుగుపరచండి’ పేరిట గత వారం దీప్కే ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన సొంత జిల్లా హింగోలిలోని లింబాలాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హింగోలి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది లేదని తెలిపారు. అంతకుముందు ఓ గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మద్యం తాగి తరగతి గదిలో నిద్రపోతున్న వీడియోను సామాజిక మాధ్యమంలో దీప్కే పోస్టు చేశారు. ఆ టీచర్‌ను మంగళవారం అధికారులు సస్పెండ్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు