
నిర్మాతగా ఎంఎస్ రాజు అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణించారు. కానీ దర్శకుడిగా మాత్రం ఆ స్థాయి విజయం దక్కలేదు. వేరైటీ సినిమాలు చేస్తూ వచ్చారు. ఇదేంటి ఎంఎస్ రాజు ఇలాంటి సినిమాలు చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మిస్టరీ, హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో `అగధ` చిత్రాన్ని రూపొందించారు. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో భానుచందర్, శ్రావణ్ రెడ్డి, వనితా విజయ్ కుమార్, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. స్వతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఎంఎస్ రాజు దర్శకుడిగా కొత్తగా చేసిన ప్రయత్నమిది. దేవి రేంజ్‌లో ఉంటుందని ఆయన చెబుతూ వచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. దీనికి చాలా వరకు నెగటివ్ టాక్ వచ్చింది. తాజాగా కలెక్షన్లు కూడా అలానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించడం లేదు. మొదటి రోజు తక్కువ కలెక్షన్లు వచ్చాయి. కేవలం ముప్పై లక్షలు మాత్రమే వచ్చినట్టు ట్రేడ్ సైట్లు వెల్లడించాయి. అయితే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పుంజుకోవడం విశేషం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కలెక్షన్లు పెరిగాయి. సుమారు రూ.43లక్షలు వచ్చాయి. ప్రీమియర్స్ ద్వారా మరో ఐదు లక్షల వరకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రానికి ఇండియాలో రూ.78లక్షలు రావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు కోటి వరకు వచ్చినట్టు టాక్. అంటే దాదాపు యాభై లక్షల వరకు షేర్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ కావాలంటే ఐదు కోట్ల షేర్ రావాలని సమాచారం. అంటే పది కోట్ల గ్రాస్ రావాలి. మరి ఈ చిత్రం ఆ స్థాయిలో వసూలు చేస్తుందా అనేది చూడాలి