
USS Abraham Lincoln| ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచ దేశాలను ఇంధన సంక్షోభంలోకి నెడితే.. యుద్ధరంగంలోని సైనికులకు మానసిక క్షోభ మిగుల్చుతున్నట్లు కనిపిస్తోంది. గల్ఫ్ జలాల్లో కొన్ని నెలలపాటు యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తిస్తోన్న సైనికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆహారం, మంచినీటి కొరత, అపరిశుభ్ర మరుగుదొడ్లు వారిని కుంగదీస్తున్నాయి. దాంతో యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ నౌకలోని అమెరికా నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారని అమెరికా పత్రిక మిలిటరీ టైమ్స్ కథనం పేర్కొంది. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా (USA) పలు యుద్ధ నౌకలను పశ్చిమాసియా జలాల్లో మోహరించిన సంగతి తెలిసిందే. అబ్రహాం లింకన్‌లో ఐదు వేలమంది నావికులు, మెరైన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. రికార్డు స్థాయిలో 250 రోజులుగా అది సముద్రజలాల్లోనే ఉంది. సుదీర్ఘ మోపరింపు, కఠిన పరిస్థితులు, మానసిక ఒత్తిడి సిబ్బందిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అటకెక్కడంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి కొనసాగుతోంది. మరోవైపు అబ్రహాం లింకన్ సహా ఇతర యుద్ధ నౌకలను ఉపయోగించి ఇరాన్ (Iran) ఓడరేవులను యూఎస్ మరోసారి దిగ్బంధించింది. ఈ పరిస్థితులతో వారి మానసిక స్థితిని మరింత దిగజారినట్లు కనిపిస్తోంది. అలాగే తమవారిని మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో తెలియని గందరగోళం నావికులు సముద్రంలో దూకడానికి కారణమై ఉంటుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఆరుగురు నావికులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ కథనాలను అమెరికా నేవీ అధికారులు తోసిపుచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలో ఉన్నంతకాలం యుద్ధం కొనసాగుతుందా..? ఐఆర్‌జీసీ (IRGC) చేసిన హెచ్చరిక ఇదే విషయాన్ని వెల్లడిచేస్తోంది. ఇరాన్ ఉద్దేశపూర్వకంగా అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించొచ్చని ఐఆర్‌జీసీలోని సీనియర్ అడ్వైజర్ ఒకరు వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని పొడిగించి ప్రత్యర్థిని బలహీనపర్చడం ఒక మార్గం. దీంతో ఇరాన్‌పై దాడి చేయాలనుకున్నవారు ఆలోచనలో పడతారు’’ అని పేర్కొన్నారు. గమనిక