
బంగారం అంటే భారతీయులకు ఒకప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకం.. దేశ ఆర్థిక విధానంలో కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వరుసగా బంగారం కొనుగోలు చేయడంతో మన దేశంలో బంగారం నిల్వల విలువ 115.8 బిలియన్ డాలర్లను చేరుకుంది. ఈ విలువ గత రెండేళ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం. భారతదేశంలోని విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల గణాంకాల ప్రకారం, విదేశీ నిల్వల్లో బంగారం వాటా 17 శాతానికి చేరుకుంది. ఏడాది క్రితం ఇది 12 శాతం మాత్రమే ఉండేది. అంటే.. భారత్ కేవలం డాలర్ వంటి విదేశీ కరెన్సీలపైనే మాత్రమే ఆధారపడకుండా, బంగారాన్ని కూడా ఒక కీలక ఆస్తిగా భావిస్తోందన్నమాట. భారతదేశంలో బంగారం నిల్వల విలువ పెరగడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం. రెండు ఆర్‌బీఐ నిరంతరంగా బంగారం కొనుగోలు చేయడం. 2024 ప్రారంభంలో ఔన్స్ బంగారం ధర సుమారు 2,000 డాలర్ల వద్ద ఉండగా, తరువాత కాలంలో అది 4,000 డాలర్లకు పైగా చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ ఒక్కసారిగా పెరిగింది. భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోని చాలా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, కరెన్సీ విలువల్లో మార్పుల వచ్చినప్పుడు రక్షణ పొందేందుకు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నాయి. ఈ కారణంగా బంగారం నిల్వల విలువలను పెంచుకుంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత మారిన పరిస్థితి! నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు తమ విదేశీ నిల్వలను కేవలం అమెరికా డాలర్ వంటి కరెన్సీల్లో